సీపీఎస్ విధానం.. అయోమయం!
వజ్రపుకొత్తూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆందోళన బాట పట్టేలా చేస్తోంది. ఇటీవల చేపట్టిన లక్ష సంతకాల సేకరణ దశల వారీ ఉద్యమానికి కీలకం కానుంది. మంచి జీతం, పదవీ విరమణ పొందిన తరువాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యోగుల నమ్మకాన్ని ఒమ్ము చేశాయి. భద్రత లేని సీపీఎస్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి మోసానికి పాల్పడుతున్నాయి. అందరికీ సమానమైన పింఛన్ మంజూరు కాక ఉద్యోగుల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి.
భరోసా లేని పథకం
కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం వల్ల ఉద్యోగులకు భరోసా కరువైంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ అంశమే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ప్రధాన ఎజెండా కానుంది.
ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే..
2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమలు చేశాయి. పథకాన్ని పీఎఫ్ఆర్డీ(ఫెన్స్న్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్)ల సహాయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూలవేతనం, కరువు భత్యంలో పింఛన్ కోసం మినహాయించి పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తానికి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో సక్రమంగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీల ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానంలో నష్టాలొస్తే పింఛన్ ఏ విధంగా ఇస్తారన్నది అస్పష్టత నెలకొంది.
ఉద్యోగులకు నష్టమిలా..
శ్రీకాకుళం జిల్లాలో 2004 తరువాత సుమారు 12,453 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో సుమారు 6,200 మంది ఉపాధ్యాయులే. పదవీ విరమణ తరువాత వీరికి సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగుల గ్రాట్యూటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్లో కొంత భాగాన్ని కముటేషన్ చేసుకునే వీలుండదు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే కారుణ్య నియామకంలో పాటు కుటుంబంలో ఒకరికి పింఛన్ అందే విధానం లేదు. దీంతో భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్లు తరువాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్తో ఒక గొడుకు కిందకు వచ్చారు. వీరికి అండగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి.
పెన్షన్ భిక్ష కాదు
పెన్షన్ అంటే యజమాని తన ఇష్ట ప్రకారం ఇచ్చే పారితోషికం కాదు. భిక్ష కాదు. ఎక్స్గ్రేషియా పేమెంట్ కాదు. అది ఉద్యోగి చేసిన సర్వీసుకు ఇచ్చే చెల్లింపు మాత్రమే. అది సగటు ఉద్యోగి హక్కు. వారి హక్కును కాలరాయడం అంటే మానవతా విలువలను విస్మరించడం అవుతుంది. - తమ్మినానా రామకృష్ణ,
సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత, వజ్రపుకొత్తూరు
పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి
పాత పద్ధతిలోనే పింఛన్ ఇవ్వాలి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అవిధంగా చేయూలి. ఉద్యోగుల హక్కులను కాలరాస్తే ఉద్యమాలు తప్పవు.
- ఎ.జయరామయ్య, ఉపాధ్యాయుడు,యు. కూర్మనాథపురం వజ్రపుకొత్తూరు మండలం