రూ.18లక్షల ఖర్చుతో ‘ఆవు’కు పెళ్లి
గాంధీనగర్: గుజరాత్‌లోని భావ్‌నగర్ విచిత్ర పెళ్లికి వేదికైంది. పూనమ్ అనే ఆవుకు, అర్జున్ అనే ఎద్దుకు వాటి యజమానులు రెండు రోజుల క్రితం ఊరందరిని పిలిచి వైభవంగా పెళ్లి చేశారు. ఓ అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఖర్చుకు వెనకాడుతారేమోగానీ ఆవు పెళ్లికి మాత్రం ఏలోటు రానీయలేదు. 18 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
పెళ్లి ముహూర్తం నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు అన్నీ హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం విశేషం. పెళ్లి కూతురులాగే పూనమ్ అనే ఆవును కూడా అలంకరించారు. ముఖాన బంగారు నగలను తొడిగారు. మూపురాన్ని పూలతో అలంకరించారు. వీపున కొత్త దుస్తులను అలంకరించారు. భారీ వ్యాన్‌లో ఏర్పాటు చేసిన పల్లెకిలో పూనమ్‌ను ఊరేగించారు. ఆర్జున్ అనే ఎద్దును కూడా పెళ్లి కొడుకులా అలంకరించి పెళ్లి వేదికకు తీసుకొచ్చారు. పూజారులు దగ్గరుండి మంత్రోచ్ఛారణలతో పూనమ్‌కు, అర్జున్‌కు పెళ్లి చేశారు. పెళ్లింటి విడిది, ఎదుర్కోళ్లు లాంటి సంప్రదాయాలను కూడా పాటించారు.
ఆవులను పవిత్రంగా చూడాలని, వాటిని కబేళాలకు తరలించే చర్యలకు స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతోనే తాను ఇంత డబ్బు ఖర్చుపెట్టి తన పూనమ్‌కు పెళ్లిచేశానని దాని యజమాని విజయ్‌భాయ్ తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఆవులతో సహవాసం చేస్తున్నానని, అవి ఎంత ప్రేమగలవో, అవి ఎన్ని విధాలుగా మానవజాతికి సేవలు అందిస్తున్నాయో తనకు తెలుసునని అన్నారు. పెళ్లి తంతు ముగిశాక పెళ్లికి హాజరైన 300 మంది అతిథులకు రుచికరమైన గుజరాతి వంటకాలతో విందు భోజనాన్ని వడ్డించారు. కుర్రకారు పెళ్లితంతును సెల్ ఫోన్లతో వీడియోలు తీసి షేర్ చేసుకున్నారు.