నాబార్డు ‘సహకారం’ లేదు
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యం కానున్నాయి. ఇప్పటివరకు రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సంఘాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక పై సంఘాలు కేవలం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు బిజినెస్ కరస్పాండెంట్‌గా మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు నాబార్డు గత నెల చివరలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం సమైక్య ఉద్యమం కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సంఘాలను నిర్వీర్యం చేసే నాబార్డు ఉత్తర్వులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వైద్యనాథన్ కమిటీ సూచన మేరకు నాబార్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నగదు బదిలీ పథకం అమలైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం అమలవుతున్న మూడు అంచెల విధానం (ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాలు) నుంచి సహకార సంఘాలను తొలగించి రెండంచెల విధానం ప్రవేశ పెట్టవచ్చని తెలుస్తోంది.
నాబార్డు ఉత్తర్వులు ఏమి చెబుతున్నాయంటే...
సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు.
సంఘాల ఆస్తులు, డిపాజిట్లు, షేర్ క్యాపిటల్, అప్పులు డీసీసీబీకి బదిలీ అవుతాయి.
సంఘాలకు డీసీసీబీ ఎలాంటి బడ్జెట్ ఇవ్వదు.
రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు ఇచ్చే అధికారం సంఘాలకు ఉండదు. డిపాజిట్లు కూడా సేకరించరాదు.
నేరుగా రుణాలు మంజూరు చేయనున్న డీసీసీబీ.
రైతులకు రూపే కార్డు ద్వారా సేవలు.
ఇవి చేసుకోవచ్చు...
సహకార సంఘాలు వివిధ వ్యాపారాలు చేసుకుని రుణాలు ఇచ్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎరువులు, పురుగుమందుల వ్యాపారాలతో పాటు పర్సనల్ రుణాలు, గోల్డ్ లోన్లు ఇచ్చుకోవచ్చు.
సహకార సంఘాల ద్వారా జిల్లాలో 90 వేల మంది రైతులకు ఏటా రూ.400 కోట్లు రుణాలు అందుతున్నాయి. అయితే సహకార సంఘాలు డీసీసీబీ రైతులకు ఇచ్చిన రుణాలు వసూలు చేస్తే సంఘానికి కమీషన్ రూపంలో ఆదాయం వస్తుంది.