ఎంబీబీఎస్‌లో పాఠ్యాంశంగా క్రిటికల్‌కేర్
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సేవల్లో క్రిటికల్‌కేర్ స్పెషలిస్టుల పాత్రే కీలకమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరి కొరత తీవ్రంగా ఉన్నందున సమస్య పరిష్కారానికి ఎంబీబీఎస్‌లో క్రిటికల్ కేర్‌ను ఓ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారం హోటల్ మరియట్లో జరిగిన క్రిటికల్‌కేర్ సౌత్‌జోన్ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు చెందిన 500 మంది వైద్యులు, 250 మంది నర్సులు హాజరయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో థుంబై ఆస్పత్రి సీఎండీ డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే క్రిటికల్కేర్పై అవగాహన కల్పించడం వల్ల రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐసీయూ కేర్ సేవలందించేందుకు సమగ్ర బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఐసీయూలో విధిగా నిపుణులను నియమించాలని, లేనిపక్షంలో వాటిని మూసివేయడమే ఉత్తమని సూచించారు. దేశీయంగా తయారైన వైద్య పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. సదస్సులో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఘన్‌శ్యామ్, కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జె.శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.