పాల ఉత్పత్తిని పెంచేందుకే సబ్సిడీ పథకాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకే ప్రభుత్వం సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ జిల్లా డిఫ్యూటి డెరైక్టర్ సి.తిరుపతిరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తిని పెంచడంలో భాగంగానే గతేడాది డిసెంబర్ 1న పాల ధరలను పెంచినట్లు ఆయన తెలిపారు.
రైతులకు పశుదాణా, ముడి పదార్థాలు, పచ్చిగడ్డి, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగినందున వారు నష్టపోకుడదనే ప్రభుత్వం ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపుతో గేదె పాలకు లీటర్ ధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.50 పైసలు, ఆవు పాలకు లీటరుధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.27 పైసలు పెంచినట్లు ఆయన తెలిపారు. కల్తీలేని నాణ్యమైన పాలను ఆయా గ్రామాల్లోని విజయ పాల సేకరణ కేంద్రానికి తీసుకువెళ్ళి సరియైన ధరను పొందవచ్చన్నారు. కోనుగోలులో ఎవరైనా ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తన దృష్టికి తీసుకువ స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు.
ప్రభుత్వ సబ్సిడిలను వినియోగించుకోవాలి
విజయ పాల సేకరణ కేంద్రంలో క్రమం తప్పకుండా పాలను సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని తిరుపతిరెడ్డి తెలిపారు. పాడి రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని అభివృధ్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరారు. తమ సంస్థ సహకారంతో తక్కువ ధరకు విజయ పశువుల దాణాను పాడి రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏభైశాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు, లవణ మిశ్రమం( మినరల్ మిక్చర్), గాలి కుంటువ్యాధి నివారణ టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా 75శాతం సబ్సిడీపై నట్టల నివారణ మందులను ఇస్తున్నామన్నారు. ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు వచ్చే రోగాలను గుర్తించి, మందులను సరాఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల బీమా, చాఫ్ కట్టర్స్, కృతిమ గర్భధారణ లాంటి సాంకేతిక సదుపాయాలను కల్పిస్తున్నమని తెలిపారు.అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ డెయిరీ ఆవరణలో ఎ.పి.బి.ఎన్ పశుగ్రాసం పెంచి రైతులకు గడ్డి కాండం మొక్కలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.