ఏపీ ఎన్జీవోల నేత యువరాజులు నాయుడు కన్నుమూత
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
సమైక్య ఉద్యమంలో కీలక భూమిక
నివాళులర్పించిన ఏపీఎన్జీవోలు,
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు
పలమనేరు: పలమనేరు ఏపీ ఎన్జీవోస్ నేత యువరాజులు నాయుడు (52) గుండె పోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని సోమవారం పలమనేరుకు తరలించారు. యువరాజులు నాయుడు మృతిచెందారనే వార్తతో స్థానికంగా ఉన్న పలువురు ఎన్జీవో సంఘ నేతలు విస్మయానికి గురయ్యారు. ఆయన స్వగ్రామమైన మండీపేటకోటూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈయన గతంలో బెరైడ్డిపల్లె డెప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తూ బదిలీపై వి.కోట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లో జరిగే అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్‌కు రెండు నెలల క్రితం వెళ్లారు. అక్కడ గుండెపోటుకు గురై తొలుత నిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అయితే 15 రోజుల క్రితం పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సమైక్య ఉద్యమంలో కీలక భూమిక
పలమనేరు పట్టణంలో 213 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన జై సమైక్యాంధ్ర ఉద్యమంలో యువరాజులునాయుడు కీలకభూమిక పోషించారు. రాష్ట్ర విభజన అంశం తెరమీదికి రాగానే సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకుని రోడ్లపైకొచ్చేశారు. రాష్ట్రం లోనే మొట్టమొదట ఉద్యమాన్ని పలమనేరులోనే ప్రారంభించడంలో ఆయన కృషి ఉంది. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, సంఘటిత, అసంఘటిత, విద్యార్థులను ఉద్యమంలో సమీకృతం చేసి జేఏసీ ద్వారా ఉద్యమాన్ని ముందుకుతీసుకెళ్దారు. రాజకీయ పార్టీలను సైతం ఉద్యమ గొడుకు కిందకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఉద్యమం సాగినన్నాళ్లు ప్రతి కార్యక్రమంలోనూ నాయుడు జేఏసీ అధ్యక్షులుగా కీలకంగా వ్యవహరించారు. తను నివాసముండే కాలనీకి జై సమైక్యాంధ్ర కాలనీగా నామకరణం సైతం చేయించారు.
ఎమ్మెల్యే పరామర్శ
పలమనేరు: పలమనేరు ఏపీ ఎన్జీవోల నాయకులు యువరాజులు నాయుడు కుటుంబాన్ని సోమవారం పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరామర్శించారు. యువరాజులు నాయుడు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చి అక్కడి నుంచి పలమనేరుకు చేరుకున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి కష్టమొచ్చినా ఆదుకుంటామన్నారు. ఆయన వెంట పలమనేరు పట్టణ, మండల, గంగవరం వైఎస్సార్సీపీ కన్వీనర్లు హేమంత్‌కుమార్‌రెడ్డి, బాలాజీనాయుడు, మోహన్‌రెడ్డితో పాటు పలువురున్నారు.