కేజీ బ్లాక్ నుంచి ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి ప్రారంభం
న్యూఢిల్లీ: సుదీర్ఘ జాప్యం తర్వాత కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీప్ సీ బ్లాక్ నుంచి ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విషయం తెలిపారు. అయితే, ఉత్పత్తి చేస్తున్న పరిమాణాన్ని మాత్రం వెల్లడించలేదు. కేజీ–డీడబ్ల్యూఎన్–98/2 (కేజీ–డీ5) ప్రాజెక్టుతో తమ చమురు ఉత్పత్తి సామర్ధ్యం 11 శాతం, గ్యాస్ ఉత్పత్తి సామర్ధ్యం 15 శాతం పెరుగుతుందని ఓఎన్జీసీ తెలిపింది.
2022–23లో ఓఎన్జీసీ 18.4 మిలియన్ టన్నుల క్రూడాయిల్, రోజుకు 20 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. తాజాగా అందుబాటులోకి వచి్చన బ్లాక్‌లో చమురు ఉత్పత్తి గరిష్టంగా రోజుకు 45,000 బ్యారెళ్లు, గ్యాస్ ఉత్పత్తి 10 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి చేరగలదని మంత్రి తెలిపారు.
అయితే, ఎప్పటికి ఆ స్థాయిని చేరవచ్చనేది వెల్లడించలేదు. కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన కేజీ–6 బ్లాక్ పక్కనే కేజీ–డీ5 బ్లాక్ ఉంది. దీన్ని మూడు క్లస్టర్లుగా విడగొట్టి ముందుగా రెండో క్లస్టర్‌పై పనులు ప్రారంభించారు. వాస్తవ ప్రణాళికల ప్రకారం 2021 నవంబర్లోనే ఇందులో ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ పరిణామాలతో 2023 మే నెలకు, అటుపైన ఆగస్టుకు, తర్వాత డిసెంబర్‌కు వాయిదా పడుతూ వచి్చంది.