ఇతర ప్రాంతాలకూ ‘నెక్సస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ స్టార్టప్‌లకు తోడ్పాటునిచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటైన ’నెక్సస్ స్టార్టప్ హబ్’ తాజాగా ఇతర ప్రాంతాలకూ కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. టి–హబ్ తరహా భాగస్వాములతో జట్టు కట్టే దిశగా చర్చలు జరుపుతోంది. సోమవారమిక్కడ టి–హబ్‌లో డిఫెన్స్ స్టార్టప్స్ వర్క్‌షాప్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) ఎరిక్ అజూలే ఈ విషయాలు తెలియజేశారు.
అమెరికా ప్రభుత్వ సహకారంతో నెక్సస్ స్టార్టప్ హబ్ తొలిసారిగా భారత్‌లోనే ఏర్పాటైందని ఆయన చెప్పారు. ‘‘దీనిద్వారా ఇప్పటిదాకా 93 స్టార్టప్ సంస్థలకు శిక్షణ అందించాం. సుమారు రెండేళ్ల కాలంలో ఇవి దాదాపు 5.6 మిలియన్ డాలర్ల మేర నిధులు సమీకరించాయి. వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి’’ అని ఎరిక్ వివరించారు. మరోవైపు, రక్షణ రంగంలో భారత్, అమెరికా పరస్పర సహకారంతో ముందుకెడుతున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ (తాత్కాలిక) ఎరిక్ అలెగ్జాండర్ తెలిపారు.
ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు తోడ్పడతాయన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్, నెక్సస్ స్టార్టప్ హబ్ కలిసి నిర్వహిస్తున్నాయి. ఇందులో మార్ఫిడో టెక్నాలజీస్, కాన్‌స్టెలీ సిగ్నల్స్ వంటి 15 పైగా స్టార్టప్‌లు పాల్గొంటున్నాయి. రక్షణ రంగంలో వ్యాపారావకాశాల గురించి స్టార్టప్ సంస్థలు అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ నెల 18, 19న హైదరాబాద్‌లోనే జరగనున్న అమెరికా– భారత్ రక్షణ రంగ సదస్సులో కూడా పాల్గొనే అవకాశం స్టార్టప్స్‌కు దక్కనుంది.
దిగ్గజాలతో అవకాశాలకు వేదిక..
లాక్‌హీడ్ మార్టిన్ వంటి రక్షణ రంగ దిగ్గజ సంస్థల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్‌షాప్‌లు తోడ్పడతాయని స్టార్టప్ సంస్థ కాన్‌స్టెలీ సిగ్నల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సత్య గోపాల్ పాణిగ్రాహి తెలిపారు. కీలకమైన మేథోహక్కులు, దిగ్గజ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశాల గురించి అవగాహన పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుం దని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాడార్ సిమ్యులేషన్ సిస్టమ్స్‌ను రూపొందించే కాన్‌స్టెలీ సిగ్నల్స్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. సహ వ్యవస్థాపకుడు అవినాష్ రెడ్డితో పాటు నలుగురితో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 12 మం ది సిబ్బంది ఉన్నారని పాణిగ్రాహి తెలిపా రు. దేశీయంగా ఇప్పటిదాకా రెండు సిస్టమ్స్ విక్రయించామని, వీటి ఖరీదు రూ. 50 లక్షల నుంచి రూ.8–10 కోట్ల దాకా ఉంటుందని తెలిపారు.