నోట్ల రద్దు... దీర్ఘకాలానికి మంచిదే
స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం
పెరగనున్న పన్నుల ఆదాయం
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి
సింగపూర్: పెద్ద నోట్లకు చట్టబద్ధత లేకుండా చేయడం వల్ల(డీలీగలైజేషన్) స్వల్పకాలికంగా వృద్ధికి విఘాతం కలిగించే అవకాశాలున్నప్పటికీ, మధ్య-దీర్ఘకాలికంగా స్థూల ఆర్థిక స్థితిగతులపై దీని ప్రభావాలు సానుకూలంగానే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఎంత వేగంగా, ఎంత సమర్ధవంతంగా హ్యాండిల్ చేయగలిగితే, ప్రతికూల ప్రభావాలు అంత తక్కువగా ఉంటాయని డీమోనటైజేషన్ అంశంపై రాసిన వ్యాసంలో సుబ్బారావు విశ్లేషించారు. ’అత్యంత స్వల్పకాలికంగా చూస్తే డీలీగలైజేషన్.. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది.
వినియోగంపై నగదు కొరత ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా మధ్య, దీర్ఘకాలిక స్థూల ఆర్థిక ప్రభావాలను చూస్తే, సానూకూలమే’ అని ఆయన పేర్కొన్నారు. డీలీగలైజేషన్ వల్ల విచక్షణేతర వినియోగాలు తగ్గడం వల్ల ఆ మేరకు వినియోగదారుల ధరల ఆధారిత సూచీపైనా ప్రభావం పడి, ద్రవ్యోల్బణం తగ్గవచ్చని తెలిపారు. చట్టబద్ధత లేని కరెన్సీని బ్యాంకుల్లో డిపాజిట్ చేశాక, కొత్త కరెన్సీ చెలామణీలోకి రాగానే కొన్ని సానుకూల పరిణామాలు కనిపించడం మొదలుపెట్టగలవని ఆయన చెప్పారు. నల్లధనపు ఎకానమీ అధికారిక ఆర్థిక వ్యవస్థలో కలిసిపోతుందని, న్యాయబద్ధమైన ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించగలదని తెలిపారు.
ప్రభుత్వానికి మరింత ఆదాయం..
ఇంతవరకూ లెక్కల్లో లేని సంపద ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిపై వచ్చే పన్నుల రూపంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడగలదని సుబ్బారావు తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు అదనపు పన్నుల కింద స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కనీసం అరశాతం మేర (దాదాపు రూ. 65,000 కోట్లు) దఖలుపడే అవకాశం ఉందన్నారు. ఇది ఆర్థిక స్థిరత్వానికి, ఇన్ఫ్రాలో పెట్టుబడులు మొదలైన వాటికి ఉపయోగపడగలదన్నారు. వ్యవస్థ ప్రక్షాళన చేయడమనేది ఇటు పొదుపునకు, అటు పెట్టుబడులకు కూడా సానుకూలాంశమేనని సుబ్బారావు వివరించారు. ఇక, ఆర్బీఐ పాలసీ రేట్లలో కోత పెట్టకపోరుునా కూడా ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ల రాకతో బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయని సుబ్బారావు పేర్కొన్నారు. బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు, మరింతగా రుణ వితరణకు వెసులుబాటు లభించగలదని చెప్పారు.