కేజీహెచ్‌లో టీబీ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు
ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ వెల్లడి
విశాఖ మెడికల్ : క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించడంలో కీలకపాత్ర వహించే డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ కేంద్రాన్ని కేజీహెచ్‌లో నెలకొల్పినట్టు ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ తెలిపారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వసుంధర సమన్వకర్తగా, ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ దేవీమాధవీ, కేజీహెచ్ పిల్లల విభాగధిపతి పద్మలత, మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.లక్ష్మి, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయబాబు, కేజీహెచ్ డీఎంసీ మెడికల్ ఆఫీసర్ బాలసుందరం సభ్యులుగా ఉన్న జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమ(ఆర్ఎన్టీసీపీ) కోర్ కమిటీ సమావేశం శుక్రవారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయను ప్రభుత్వం నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించినందున ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయినా ఈ వ్యాధికి చికిత్స అందించి, సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. జనాభాలో రెండు శాతం మందికే టీ బీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి మరొకరికి సోకడం వల్ల 48 శాతం మందికి వ్యాపిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి హెచ్ఐవీ రోగుల్లో పది రెట్లు తొందరగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు. లక్ష మందిలో 203 మందికి టీబీ సోకుతుండగా వీటిలో 140 కేసులు మాత్రమే గుర్తించగలుగుతున్నామన్నారు. దేశంలో 5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్‌ను, లక్ష మందికి ఒక డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్ (డీఎంసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 63 డీఎంసీ కేంద్రాలున్నాయని, ఆంధ్రా వైద్యకళాశాల, కేజీహెచ్ పరిధిలో ఒక డీఎంసీ సెంటర్ పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రంలో అధునాతన ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.