సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలి
తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతి వ్యాపారంలోనూ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని, అయితే నిబ్బరంగా నిలవగలిగితే అవకాశాలు అందిపుచ్చుకోగలమని మొబైల్ సొల్యూషన్స్ సంస్థ తాన్లా సీఎండీ ఉదయ్ రెడ్డి తెలిపారు. ఇదే ప్రాతిపదికగా.. ప్రతికూలతలను ఎదుర్కొని అసాధ్యాలను సుసాధ్యం చేసే దిశగా తాన్లా ప్రస్థానం సాగుతోందని ఆయన పేర్కొన్నారు. తాన్లా నిర్వహించిన ‘ది డైలాగ్ బాక్స్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఉదయ్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు. మొబైల్ టెక్నాలజీ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ముందుగా ఊహించలేకపోవడం వల్ల తమ సంస్థ కూడా ఒక దశలో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ..
దృఢనిశ్చయంతో వాటిని అధిగమించి ముందుకు సాగామని వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 బిలియన్ల మెసేజీలు ప్రాసెస్ చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ఏ2పీ మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా తాన్లా నిలవగలిగిందని ఉదయ్ రెడ్డి తెలిపారు. ప్రతికూలతలను అధిగమించిన నేపథ్యంలో సవాళ్లను వృద్ధి అవకాశాలుగా మల్చుకుంటోందని చెప్పారాయన. ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, ప్రొస్థెటిక్ కాళ్లతో మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన మార్క్ ఇంగ్లిస్ తదితరులు పాల్గొని, తమ అనుభవాలను పంచుకున్నారు.