భారత్-పాక్ చర్చల్లో కీలక మలుపు
న్యూఢిల్లీ: ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత ఊపందుకున్న భారత్- పాక్ చర్చల సన్నాహాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం అనంతరం 'కశ్మీర్ అంశంపై చర్చలకు రండి' అంటూ పాక్ విదేశాంగ మంత్రి సర్తార్ అజీజ్ పంపిన అహ్వానానికి భారత్ ప్రభుత్వం అధికారిక సమాధానం ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదం(క్రాస్ బోర్డర్ టెర్రరిజం)పై మాత్రమే చర్చలు జరుపుతామని, కశ్మీర్.. భారత్ లో అంతర్భాగం కాబట్టి ఆ అంశంలో మీతో(పాక్ తో) చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ గౌతం బంబావాలే బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శికి లేఖను అందజేశారు.
సీమాంతర ఉగ్రవాదంపై చర్చల కోసం ఇస్లామాబాద్ వచ్చేందుకు భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ సిద్ధంగా ఉన్నారని భారత్ ఆ లేఖలో పేర్కొంది. కాగా, భారత్ ప్రతిపాదనపై పాక్ స్పందించాల్సిఉంది. సోమవారం పాక్ విదేశాంగ శాఖ భారత్ కు రాసిన లేఖలో కశ్మీర్ అంశంపై చర్చలకు రావాల్సింగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అనుసరించి కశ్మీర్ విషయంలో నిర్ణయానికి వద్దామని పాక్ పేర్కొంది. అయితే కశ్మీర్ తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, బలూచిస్థాన్ లలో పాక్ దమనకాండను ఎత్తిచూపాలన్న ఎత్తుగడతోనే భారత్ అడుగులే వేస్తున్నది. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని మోదీ.. ఆయా ప్రాంతాల్లో పాక్ దమననీతిని ఎండగట్టిన సంగతి తెలిసిందే.