ఢిల్లీ నాయకుడి గల్లీ మాటలు
హన్మకొండ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొన్న సభతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. ఆదివారం హన్మకొండ రాంనగర్లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమిత్షా రాకతో వరంగల్ రూపు రేఖలు మారుతాయని ఆశించామన్నారు. ఆయన జిల్లా అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు ప్రకటించకుండానే వెళ్లిపోయారన్నారు.
ఇది రాష్ట్ర బీజేపీ నాయకుల వైఫల్యమన్నారు. ఢిల్లీ స్థాయి నాయకుడు వచ్చి, గల్లీ మాటలు మాట్లాడటం దారుణమన్నారు. ఇందుకు బీజేపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన ముందుకు కదలడం లేదన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటును కేంద్రం మరిచిందన్నారు. వరంగల్ నగరాన్ని నర్మ్, హృదయ్ పథకాల్లో చేర్చినా ఇప్పటిదాకా చిల్లిగవ్వ కూడా విదిల్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వడం లేదన్నారు. అయినా రూ.వేల కోట్లు ఇచ్చామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. బీజేపీలో ఉన్న నలుగురిలోనే సఖ్యత లేదని, వీరితో పార్టీ బలపడుతుందా అని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, ఎల్లావుల లలితా యాదవ్, మరుపల్లి రవి, చేవెళ్ల సంపత్, జోరిక రమేష్, వాసుదేవరెడ్డి, కోల జనార్దన్, పద్మ పాల్గొన్నారు.