ఆన్లైన్లో భోజన పథకం వివరాలు
విశాఖ : ఇకపై మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పథకం రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ గౌరీశంకర్ తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తదితర వివరాలను ప్రతి నెలా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు దగ్గర నుంచి తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలతో కూడిన యు డైస్ను సిద్ధం చేయాలని ప్లానింగ్ అధికారులకు సూచించారు. తరువాత రైల్వే న్యూ కాలనీలో గల కె.ఎన్.ఎం.స్కూల్, ఎంసీహెచ్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులు ఆదేశించగా మధ్యాహ్న భోజన పథకం బకాయిలు విడుదల చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు.