చారిత్రక కథా చిత్రంలో అజిత్?
నటుడు అజిత్ తదుపరి నటించనుంది చారిత్రక కథా చిత్రమా?.. అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అజిత్ తాజా చిత్రం వేదాళం నిర్మాణం పూర్తి చేసుకుంది. దీపావళి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.ఆయన తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై చిత్ర వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో అజిత్ భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటించనున్నారనే ప్రచారం వెలుగులోకొచ్చింది. అజిత్‌కు ఇష్టమైన దర్శకుల పట్టికలో విష్ణువర్ధన్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు.
వీరి కాంబినేషన్లో వచ్చిన బిల్లా, ఆరంభం చిత్రాలు ఘన విజయం సాధించాయి. కాగా విష్ణువర్ధన్ ఇటీవల తన సోదరుడు కృష్ణ, ఆర్యలతో తెరకెక్కించిన మట్చన్ చిత్రం ఆశించిన విజయం సాధింకపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. అలాంటి సమయంలో అజిత్ నుంచి ఫోన్ వచ్చింది. మనం కలిసి మరో చిత్రం చేద్దాం. మంచి చారిత్రక కథను సిద్ధం చేయండి అన్నదే అజిత్ ఫోన్లో చెప్పిన సారాంశం. అజిత్ ఇప్పటి వరకూ చారిత్రాత్మక కథా చిత్రం చెయ్యలేదు.
సమీప కాలంలో వచ్చిన బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలు చూసిన తరువాత అజిత్‌కు ఆ తరహా భారీ చిత్రం చెయ్యాలనే ఆశ కలిగిందని సమాచారం. అజిత్ లాంటి హీరో ఫోన్ చేయడంతో దర్శకుడు విష్ణువర్ధన్ వెంటనే స్థానిక మైలాపూర్‌లో ఉన్న ప్రముఖ రచయిత బాలకుమార్ ఇంట్లో వాలారు. అజిత్ అభిప్రాయాన్ని బాలకుమార్‌కు తెలియజేశారు. అంతే ఆయన రాసిన ఉడయాన్ నవల చిత్రంగా తెరపై ఆవిష్కరణకు సన్నాహాలు జరిగి పోతున్నాయని సమాచారం.
ఇది రాజరాజచోళన్ తంజావూర్లో గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి చేసిన సాధనలే ఈ ఉడయాన్ నవల ఇతివృత్తం అని తెలిసింది. ఇప్పుడీ నవలను చిత్రంగా మలచే పనిలో దర్శకుడు విష్ణువర్ధన్, రచయిత బాలకుమార్‌లు నిమగ్నమయ్యారని సమాచారం. కాగా అజిత్ కొంతకాలంగా గాయంతో బాధపడుతున్నారు. తన కాలుకు అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆ తరువాత ప్రెష్‌గా ఈ చారిత్రక కథా చిత్రంలో నటిస్తారని కోలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం.