వనమార్గం... ఏడుపాయల...
మనదగ్గరే...!
తెలుగు రాష్ట్రాలలో ఒక్కో జిల్లాలో ఒక్కో విశిష్టత ఉన్న దేవాలయాలు, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. మెదక్ జిల్లాలో వైవిధ్యం కల దర్శనీయ క్షేత్రం ఏడుపాయల. ఇక్కడ వనదుర్గా భవాని మాత కొలువై ఉండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాతగా ఖ్యాతి గడించింది.
ఘనపూర్ ఆనకట్ట సమీపంలో పర్వతారణ్యాల మధ్య మంజీర నది తీరాన ఉండంతో ఏడుపాయల క్షేత్రం అత్యంత ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ మరో ఆరు చిన్న వాగులు మంజీరా నదిలో కలుస్తుంటాయి. దీంతో ఈ క్షేత్రం ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడుపాయలను నాటి రోజుల్లో జమదగ్ని, అత్రి, కాశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, గౌతమి అనే సప్తరుషుల పేర్లతో పిలిచేవారు.
ఎన్నో కథనాలు...
గరుడగంగగా పిలువబడే మంజీరా నది పుట్టుక, ఏడుపాయలుగా చీలిపోవడం గురించి భిన్న కథనాలున్నాయి. జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్తు మరణానికి కారణమైన సర్పజాతినంతటిని అంతం చేయాలని సప్తరుషులతో యాగం చేయించాడని, ఆ యాగం జరిగిన ప్రదేశమే నేటి ఏడుపాయల అని చెబుతుంటారు. ఇక్కడ ఉన్న రాళ్లపై గుండ్రటి ఆకారంలో గుంతలు ఉంటాయి. ఈ క్షేత్రానికి కొద్ది దూరంలో ఉన్న ఎల్లాపూర్ గ్రామ పరిసరాల్లో మంజీరా నది ఒడ్డున ఇసుక మేటలు తవ్వితే విభూతి మాదిరిగా ఉండే తెల్లటి మట్టి కనిపిస్తుంది. దీని ఆధారంగా ఇక్కడే యాగం జరిగిందంటారు. మరో కథనం ప్రకారం సర్పజాతికి మోక్షం ప్రాప్తించడానికి గరుత్మంతుడు గంగాదేవి వద్దకు వెళితే, ఆమె తన అందె (మంజీరం) గరుత్మంతునికి ఇచ్చి దానిని తీసుకొని ముందుకు వెళుతుంటే తాను అనుసరిస్తానని చెప్పిందట. ఈ క్రమంలో మంజీరా నది ఏడుపాయలుగా చీలి సర్పయాగ స్థలం వద్ద ఉరుకులు పరుగులు తీసింది అని, ఆ పుణ్యనదీ జలాల స్పర్శతో మృత్యువాత పడిన సర్పాలకు ఊర్ధ్వలోకం ప్రాప్తించిందని చెబుతారు. అందుకే ఏడుపాయల క్షేత్రలో మాఘ అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
గుర్తులెన్నో చూపే గుహాలయం...
ముందుగా వనదుర్గాభవాని మాతను దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడ పాపాల మడుగులో స్నానాలాచరిస్తుంటారు. ఇంకా ఏకోత్తర శతకుండలం, మునిపుట్ట, తపోభూమి సందర్శించవచ్చు. పూర్వకాలంలో ఈ ప్రాంతం ఒక గుహాలయంగా ఉండేది. కాలక్రమంలో గుహలను తొలచి ఆలయంగా తీర్చిదిద్దారు. ఈ గుహాలయం నదీ తీరాన దిగువభాగంలో ఉండగా దీని పైభాగాన ఒక పుట్ట, ఆ పుట్టకు సమీపాన ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహలోనే పూర్వం మునులు తపస్సు చేశారని చెబుతారు. అలనాటి మునులకు చిహ్నంగా ఇక్కడ ఒక ముని విగ్రహం కూడా ఉంది. భక్తులు ముందు వనదుర్గాభవానిని దర్శించి, తర్వాత కొండపైకి వెళ్లి ముని విగ్రహాన్ని, గుహను, మునిపుట్టను దర్శిస్తారు.
ఇలా వెళ్లచ్చు...
జిల్లాలోని పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో వనదుర్గ కొలువై ఉంది. మెదక్ జిల్లా నుండి 20 కి.మీ దూరం, సంగారెడ్డి నుండి 90 కి.మీ, హైదరాబాద్ నుండి 130 కి.మీ దూరంలో ఏడుపాయల ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలనుకునేవారికి హైదరాబాద్, సంగారెడ్డి నుండి బస్సు సౌకర్యం ఉంది.
- డి. శ్రీనివాస్, పౌరసంబంధాల శాఖ, సంగారెడ్డి, మెదక్ జిల్లా