పీహెచ్డీ@ 78
సీతంపేట, న్యూస్‌లైన్ : ఎవరైనా పదవీ విరమణ తర్వాత ఏంచేస్తారు? రామాకృష్ణా అంటూ కాలక్షేపం చేస్తారు. ఇష్టమైన గ్రంథాలను చదువుతుంటారు. లేదంటే ఏదో వ్యాపకం పెట్టుకుంటారు. కానీ ఆయన అలా చేయలేదు. దాదాపు ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై మమకారం పెంచుకున్నారు. విశ్రాంతి తీసుకునే ప్రాయంలో డాక్టరేట్ కోసం తపించారు. ఎన్నో ఒడుదుడుకులెదురైనా అధిగమించారు. అనుకున్నది సాధించారు. డాక్టర్ నరసింహారావు అయ్యారు.
విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లో ఉంటున్న ఎన్.డి.నరసింహారావు వయసు 78 ఏళ్లు. సెంట్రల్ హిందీట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(ఢిల్లీ)లోఅసిస్టెంట్ డెరైక్టర్‌గా పదవీ విరమణ చేసి 20 ఏళ్ళయింది. లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి వివిధ హోదాల్లో 24 ఏళ్ళు పనిచేశారు. ఈ క్రమంలో ఎందరో విద్యార్థులు రాసిన థీసిస్ చదివారు. తానూ బాగా థీసిస్ రాయగలనన్న నమ్మకంతో 2010లో పీహెచ్డీ ఎంట్రన్స్ రాసి అర్హత సాధించారు.
ప్రొఫెసర్ ఆర్.డి.శర్మ పర్యవేక్షణలో ‘హిందీ తెలుగు దళిత ఆత్మ కథల తులనాత్మక అధ్యయనం’ అనే అంశపై పరిశోధన చేసి డిసెంబర్ 2011లో 650 పేజీల థీసిస్ సమర్పించారు. ఈనెల 5న దక్షిణ భారత హిందీ ప్రచార సభ నరసింహారావుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. థీసిస్ సమర్పించే గడువు తేదీకి నెల రోజుల ముందు తన భార్య చనిపోయింది. అంతటి దుఃఖంలోనూ చివరి నెల రోజులు, రోజుకు 20 గంటలు శ్రమించి థీసిస్ సమర్పించారు. కృషి, పట్టుదల, సంకల్పబలం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు నరసింహారావు. మంచి ఆరోగ్యపు అలవాట్ల వల్లే 78 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారాయన.