ఆదర్శ గ్రామాలను నిర్మించుకుందాం
మా పల్లె-మా ప్రాణం అనే భావనతో పని చేస్తే వలసలు ఆగుతాయి. మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో పల్లెలు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రమైనది. దీనిని ప్రతి ఇంటి యజమాని గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోవాలి. మలమూత్రాల విసర్జనకు చాలా మంది ఇప్పటికీ ఆరుబయటకే వెళ్లవలసి రావడం అవమానకరం. దీనిని నివారించాలి.
ఎంపీలు, ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియో జకవర్గాలలో వసతుల కల్పన కోసం ప్రవేశ పెట్టిన ఎంపీ ల్యాడ్స్, ఎంఎల్ఏ ల్యాడ్స్ పథకం ఆశించిన ప్రయో జనం సాధించలేదు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాప్రతి నిధులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే పథకానికి సన్నాహాలు చేశారు. అయితే ఆదర్శగ్రామం అంటే? అది నిర్ధారించడం క్లిష్ట సమస్యే. అయినా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలలో ఎన్నుకున్న, నియమితులైన సభ్యులంతా తలొక గ్రామాన్ని ఎంచుకుని, తీర్చిదిద్దితే గొప్ప మేలు జరు గుతుంది. వీరు వేలల్లో ఉంటారు. అలాగే నగర పాలక సంస్థలను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చి, వ్యాపార సంస్థలు కూడా తమ వంతు కర్తవ్యం నిర్వహించే విధంగా చూడాలి. ఈ పథకంలో భాగస్వాములంతా ఏటా రెండు గ్రామాలను, నగర పంచాయతీలలో రెండు వార్డులను అభివృద్ధి చేస్తే అనతికాలంలోనే జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రతి పల్లెకు ప్రస్తుతం ఉన్న అవసరాలను తీర్చడంతో పాటు, ఐదు నుంచి ఇరవై సం వత్సరాల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఇం దుకు పథకాలు తయారుచేయాలి. ప్రజాప్రతినిధులు, ప్రజలు అంతా ఏకాభిప్రాయంతో ఇందులో పనిచేస్తే ఇదే ఒక ప్రజా ఉద్యమమవుతుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు మేధావులు కూడా ఇందులో పాలు పంచుకోవాలి.
ప్రతి నివాస ప్రాంతానికి యోగ్యత కల్పించడానికి అనేక అంశాలు అవసరం. వాటిలో ప్రథమంగా గుర్తిం చవలసినది- నేటి బాలలే రేపటి పౌరులు. వీరి సంక్షే మానికి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక విద్యాలయం, ఆరోగ్య కేంద్రం, పారిశుధ్యం వంటివి అనివార్యం. శుభ్ర మైన తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటు, మాతా శిశువులకూ, బడికి వెళ్లే పిల్లలకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. ముఖ్యంగా గర్భిణులకు పౌష్టికాహారాన్ని ఈ పథకం ద్వారా ఇవ్వాలి. ఆరోగ్య కేంద్రంలో ఇంద్రధనుష్ టీకా ఇప్పించాలి. ఆరో గ్య కార్యక్రమం ఒక తంతు కాకుండా చూడాలి. తద్వారా మాతా శిశుమరణాల సంఖ్య తగ్గించవచ్చు. అన్ని వర్గాల మహిళలు గ్రామ సభలలో పాల్గొని సమస్యలను గురిం చి వెల్లడించాలి. స్వయం సహాయ బృందాలలో సభ్య త్వం పొంది ఆర్థిక వనరులను వృద్ధి చేసుకునేటట్టు చేయాలి. ప్రతి పనికి ప్రభుత్వం వైపు చూడకుండా స్వల్ప వ్యయంతో వాటిని సాధించుకోగలిగేటట్టు సంసి ద్ధులను చేయాలి.
అన్ని కార్యక్రమాలను పంచాయతీలకే అప్పగించి, గ్రామస్తులు రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం వ్యయ నిర్ణయాల బాధ్యత కూడా ఇవ్వాలి. వాటర్‌షెడ్, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం, ఎంపీ ల్యాడ్స్, ఎంఎల్ఏ ల్యాడ్స్, ఎన్ఆర్ఎల్ఎం వంటి పథకాల నిర్వహణను అప్పగించి, అందుకు కావలసిన నేర్పరితనం, నాయకత్వానికి శిక్షణ ఇవ్వాలి. దీనితో ఫలి తాలు ఆశించినదాని కంటే ఎక్కువగా ఉంటాయి. మా పల్లె-మా ప్రాణం అనే భావంతో పని చేస్తే, వలసలు ఆగుతాయి. మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో పల్లెలు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రమైనది. దీనిని ప్రతి ఇంటి యజమాని గుర్తించి, నివారణకు చర్యలు తీసుకోవాలి. మలమూత్రాల విసర్జనకు చాలా మంది ఇప్పటికీ ఆరుబయటకే వెళ్లవలసి రావడం అవమా నకరం. ఇందువల్ల కలిగే దుష్పరిణామాలు ప్రమాద కరమైనవి కూడా. నీటి ద్వారా వచ్చే దాదాపు 70 శాతం వ్యాధులను నివారించలేకపోవడానికి కారణం ఇదే. అలాగే గ్రామీణ స్త్రీ కష్టాలు తీర్చడానికి పొగ చూరని పొయ్యిలు కూడా కీలకం.
ప్రణాళికా బద్ధమైన కృషితో పాటు, మానవీయ కోణంతో కూడా ఆదర్శగ్రామాన్ని ఆవిష్కరించుకోవాలి. ఇందుకు ఈ అంశాలను పాటించడం అవసరం.ఏ ఇంటిలోను ఆకలి ఆక్రందన వినపడకూడదు.బాలికను బరువుగా భావించరాదు. వారికి కూడా విద్యాబుద్ధులు నేర్పించాలి. బాల్య వివాహాలు నిరోధించాలి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిం చాలి. వరకట్న దురాచారాన్ని ఆపాలి.స్వయం ఉపాధి సంఘాలు డబ్బు పంచుకునే, వడ్డీలకు తిప్పుకునే వనరులుగానే భావించరాదు. పొదుపు, దక్షతలతో స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి పునాదులు నిర్మించేవిగా రూపొందించాలి. మధ్యా హ్న భోజన పథకం వీరికి అప్పగించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభి వృద్ధి, వికాస కార్యక్రమాలకు లబ్ధిదారులను ఎం పిక చేయడం, వాటి అమలులో అవకతవకలు లేకుండా చూసుకోవడం అందరి విధి.వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే భృతి సక్రమంగా అందేటట్టు చర్యలు తీసుకోవాలి.రైతుల శ్రమను గౌరవిస్తూ, వ్యవసాయోత్పత్తుల రక్షణకు గిడ్డంగులు, శీతలీకరణ సౌకర్యాలు కల్పిం చి, సహకార వ్యవస్థ ద్వారా వారిని ఆదుకోవాలి. మత్స్యకారులకు అనువైన శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని విలువైన సంపదను వ్యర్థం కాకుండా కాపాడుకోవాలి.ఇవన్నీ శిలాశాసనాలు కాదు. ప్రాంతం, ప్రజానీ కం, ఆర్థిక పరిస్థితులను బట్టి మార్పులు చేసుకోవచ్చు. కానీ ఇందుకు సంబంధించిన చైతన్యం, కదలిక అత్య వసరం.
డాక్టర్ ఎం.వి. రావు
(ఐఏఎస్, పీహెచ్డీ. మాజీ డీజీ- ఎన్ఐఆర్డీ-పీఆర్)
డాక్టర్ సి. యోగానందశాస్త్రి
(విశ్రాంత ఆచార్యులు, ఎన్ఐఆర్డీ -పీఆర్ సలహాదారు)
prof.yoganandasastry@gmail.com