ఉప లోకాయుక్త సుడిగాలి పర్యటన
గంగావతి, న్యూస్‌లైన్ : కర్ణాటక రాష్ట్ర ఉప లోకాయుక్త బృందం గురువారం గంగావతి తాలూకాలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులు, హాస్టల్, ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలించింది. గురువారం ఉదయం తాలూకాలోని సంగాపుర, రామదుర్గ, బసవనదుర్గ, కురిహట్టి క్యాంప్‌లలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఉప లోకాయుక్త శశిధర్ మజిగె పరిశీలించారు. ప్రధానంగా ఈ గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కాంపౌండ్ గోడలు, గ్రామాల్లో నిర్మించిన డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం నగరంలోని బీసీఎం హాస్టల్లోకి ప్రవేశించి హాస్టల్ మరుగుదొడ్లు, వంటగది విద్యార్థుల గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారికి ఆహారం సరిగా అందుతోందా? వసతులు సరిగా ఉన్నాయా? తాగునీటి సదుపాయం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి రిజిస్టర్‌ను పరిశీలించారు.
మహిళల కాన్పులకు సంబంధించిన ఫైళ్లను చూసి మడిలు కిట్లను సరైన రీతిలో అందించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని రోగుల వార్డులను సందర్శించి సరైన రీతిలో వైద్యులు చికిత్సలు అందిస్తున్నారా?అని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకగిరి తదితర గ్రామాలకు వెళ్లి అభివృద్ధి పనులను పరిశీలించి కుష్టిగి తాలూకాలో ప్రవేశించారు.
ఉప లోకాయుక్త వెంట కొప్పళ డీవైఎస్పీ ఎస్కే. మురనాళ్, లోకాయుక్త సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీంబాషా, గంగావతి తహ శీల్దార్ గంగన్న, తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఎస్ఎన్. మఠద్, నగరసభ కమిషనర్ నింగన్న కుంబణ్ణనవర్, స్థానిక టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జ్యోతిబా నిక్కం, ప్రభుత్వ ఆస్పత్రి పాలక మండలి అధికారి డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.