నేడు కోర్టు భవనం ప్రారంభం
కంటోన్మెంట్: సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ కోర్టు ముచ్చటగా మూడోసారి నూతన భవనంలోకి మారబోతోంది. లక్షా పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్తులతో నిర్మించిన నూతన కోర్టు భవన సముదాయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభోత్సవం ఉంటుందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మర్రి గోవర్ధన్‌రెడ్డి, టి.చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి బీఎస్.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రమేశ్ రంగనాథన్, చీఫ్ జడ్జి బాలయోగి, సికింద్రాబాద్ ఒకటో అదనపు చీఫ్ జడ్జి విష్ణుప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
మూడో భవనం
బ్రిటిష్ జమానాలో కంటోన్మెంట్లో 1874లోనే సికింద్రాబాద్ మఫిసిల్ కోర్టు పేరిట సేవలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి 1913 వరకు ప్రస్తుత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ భవనంలోనే సికింద్రాబాద్ కోర్టు కొనసాగింది. 1913లో నూతన భవన సముదాయాన్ని నిర్మించడంతో కోర్టును తరలించి.. పాత భవనాన్ని కంటోన్మెంట్ పరిపాలనా కార్యాలయంగా మార్చారు. కాలక్రమేణా అందులో 14 కోర్టులు ఏర్పడ్డాయి. నానాటికీ రద్దీ అధికమవుతుండటంతో దీని స్థానం లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని తలచి 2014లో పాత కోర్టు భవనాన్ని కూల్చేశారు. ఈ మేరకు ఐదంతస్తులతో లక్షా పది వేల చదరపు అడుగుల్లో ప్రస్తుత కోర్టు భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి కేవలం పది కోర్టులకు మాత్రమే సరిపోయేలా దీన్ని నిర్మిం చారు. త్వరలో మరో బ్లాకు నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో కోర్టులు కొనసాగేలా విస్తరించనున్నారు.