జిల్లాలో నగదు రహిత మందుల షాపులు
ఏలూరు అర్బన్ : జిల్లావాసులకు నగదు రహితంగా అన్ని ఔషధాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ (ఏడీసీ) వి.విజయశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు నగదు లేని కారణంగా రోగులు మందుల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈ పోస్, ఎం పోస్ మెషిన్ లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అటాచ్డ్, చైన్ మందుల దుకాణాల్లో నగదు రహిత విధానంలో ఔషధాలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మందుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కోసం మందుల షాపుల యజమానులతో సంబంధిత బ్యాంకుల్లో స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తు చేయించినట్టు చెప్పారు.
జిల్లాలో
ఇప్పటికే 55 సాధారణ, రిటైల్ దుకాణాల్లో మెషిన్ లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మందులు నగదు రహితంగా సులభంగా అందించేందుకు యుఎస్ఎస్డీ, యూపీఐ, ఈ పోస్ అనే మూడు విధానాలను దుకాణాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీని వల్ల మందులు అవసరమైన వారు బ్యాంకు ఖాతా కలిగి సాధారణ మొబైల్ ఫోన్ ఉంటే నగదు లేకుండానే అవసరమైన అన్ని మందులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ మేరకు అన్ని దుకాణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనువుగా ప్ల కార్డులు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకున్నామని ఏడీసీ తెలిపారు.