ఇంధన రంగానికి పునరుత్తేజం..!
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో నూతన ఆవిష్కరణలు అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేర్కొన్నారు. ఇందుకు కొత్త యంత్రాంగం సృష్టి అవసరమని అన్నారు. ఈ దిశలో ప్రస్తుత నియమ నిబంధనల చట్టాల్లో మార్పు అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలుకు వీలుకాని పలు నియమ నిబంధనల వల్ల భారత ఇంధన రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. నూతన టెక్నాలజీ అమల్లో సైతం పలు సమస్యలు ఉన్నాయని వివరించారు. ‘భవిష్యత్ పటిష్ట ఇంధన రంగానికి నూతన ఆవిష్కణలు’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన టాటా ట్రస్టులు-యూసీఎల్ఏ (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్) గ్లోబల్ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల సమావేశంలో పాల్గొన్న రతన్ టాటా ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. స్టార్టప్స్కు ప్రోత్సాహం అవసరమని అన్నారు.
ఏకీభవించిన యూసీఎల్ఏ చాన్సలర్...
రతన్ టాటా అభిప్రాయాలతో సమావేశంలో పాల్గొన్న యూసీఎల్ఏ చాన్సలర్ జీన్ బ్లాక్ పూర్తిగా ఏకీభవించారు. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించడానికి ఇంధన రంగంలో ఒక సుస్థిర పటిష్ట సాంకేతిక విధానం అవసరమని ఆయన అన్నారు.