నేను కూడా బీఫ్ తింటా.. దానిపై ఆంక్షలేవు: బీజేపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన ప్రకటన చేశారు. మేఘాలయాలో దాదాపు ప్రతిఒక్కరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారని వెల్లడించారు.
బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది తమ ఆహార అలవాటు, సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తనేం మాట్లాడదలుచుకోలేదని చెప్పారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేఘాలయలో ఉన్న వారందరూ బీఫ్ తింటారు. దానిపై ఎలాంటి నియంత్రణ లేదు. నేను కూడా తింటాను. మేఘాలయాలో బీఫ్‌పై నిషేధం లేదు. ఇది ప్రజల జీవనశైలి, దీనిని ఎవరూ ఆపలేరు. భారతదేశంలో కూడా అలాంటి నియమం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలను ఆమోదించాయి. మేఘాలయలో, మాకు కబేళా ఉంది. ప్రతి ఒక్కరూ ఆవు లేదా పందిని తీసుకొని మార్కెట్‌కు తీసుకువస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే ఇక్కడి వారికి తినే అలవాటు ఉంది’ అని అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు అవుతోందని.. ఈ కాలంలో దేశంలో ఏ చర్చిపై కూడా దాడులు జరగలేదని ప్రస్తావించారు. అలాగే బీజేపీ అధికారంలోఉన్న గోవా, నాగాలాండ్‌లో కూడా చర్చిలపై అలాంటి ఘటనలేవి చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ చేస్తున్న ఆరోపణలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని మండిపడ్డారు..
మేఘాలయలో క్రిస్టియన్లే అధికంగా ఉంటారని అందరూ చర్చికి వెళ్తారని ఎర్నెస్ట్ తెలిపారు. ఈసారి తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సాధిస్తుందన్నారు. కాగా మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
చదవండి: బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం