Estimated Expenditure
-
రియల్టీ మార్కెట్ భారీగా విస్తరణ: 2047 నాటికి
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా విస్తరించనుంది. గతేడాది నాటికి ఈ మార్కెట్ 477 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 12 రెట్ల వృద్ధితో 5.8 లక్షల కోట్ల డాలర్లకు వృద్ధి చెందుతుందని నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలియజేసింది. ఇండియా రియల్ ఎస్టేట్: విజన్ 2047’ పేరుతో రియల్టర్ల మండలి నరెడ్కో, ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. (మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!) ప్రస్తుతం దేశ జీడీపీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 7.3 శాతం వాటా కలిగి ఉండగా, 2047 నాటికి 15.5 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు (2047) దేశ జీడీపీ 33 ట్రిలియన్ డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. నివాస గృహాల మార్కెట్ 299 బిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. (అయ్యయ్యో.. ఆ శకం ముగుస్తోందా? నిజమేనా?) ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు, వేర్ హౌసింగ్ మార్కెట్ విలువ 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని వెల్లడించింది. 2023 సంవత్సంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరిగి 5.6 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. భారీ అవకాశాలు ‘‘2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించడానికి రియల్ ఎస్టేట్ రంగం చేదోడుగా నిలవనుంది. ఆర్థిక వ్యవస్థ ఎన్నో రెట్లు విస్తరించడంతో అది రియల్ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుంది. పెరుగుతున్న అవసరాలు, వినియోగానికి అనుగుణంగా ఎన్నో రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని నరెడ్కో ఇండియా ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ వివరించారు. ఆర్థిక వ్యవస్థలో అనుకూల వాతావరణం, మౌలిక రంగ వృద్ధి ప్రణాళికలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి దోహదపడతాయని నరెడ్కో వైస్ చైర్మన్ నిరంజన్ హిరనందానీ తెలిపారు. ‘‘వచ్చే 25 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో రూపాంతరం చూడనున్నాం. అధిక జనాభా, మెరుగైన వ్యాపారం, పెట్టుబడుల వాతావరణం, తయారీ, ఇన్ఫ్రాకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అనుకూలతలు’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ‘‘కరోనా తర్వాత హౌసింగ్ రంగం మరింత బలంగా, ఆరోగ్యంగా మారింది. విక్రయాలు బలంగా నమోదవుతున్నాయి. ధరలు పెరగడమే కాకుండా, అదే సమయంలో విక్రయం కాని యూనిట్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగం బలాన్ని, మెరుగైన భవిష్యత్తును తెలియజేస్తున్నాయి’’అని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. -
రూ.49,595 కోట్లకు ఫైనల్
‘పాలమూరు–రంగారెడ్డి’ తుది అంచనాలకు స్టాండింగ్ కమిటీ ఓకే సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరోమారు పెరుగుతోంది. ప్రాజెక్టు పరిధి లో జరిగిన మార్పులు, కొత్తగా చేరిన పనుల అనంతరం తుది అంచనా వ్యయం రూ.49,595 కోట్లకు చేరుతోంది. తొలి అంచనా వ్యయం రూ.35,200 కోట్లతో పోలిస్తే.. ఏకంగా రూ.14,395 కోట్లు అదనపు భారం పడుతోంది. ఈ మేరకు పెరిగిన అంచనా వ్యయాలకు నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్ఎసీ) ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అన్ని అంచనాలూ పెరిగాయి పాలమూరు పథకం తొలి ప్రతిపాదన మేరకు శ్రీశైలం నుంచి 90 రోజుల పాటు రోజుకు 1.5 టీఎంసీల చొప్పున నీటిని తీసుకుని.. పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందుకు రూ.35,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం శ్రీశైలం నుంచి 60 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 120 టీఎంసీలు తీసుకుని.. మరో 2.30 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వాలని ప్రతిపాదించారు. దీంతో పంపులు, విద్యుత్, కాల్వల అవసరాలు పెరిగా యి. తొలి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో 3,445 మెగావాట్ల విద్యుత్ అవసర మని, ఇందుకు రూ.10,335 కోట్లు ఖర్చవుతుందని లెక్కలేయగా... తాజా అంచనాల ప్రకారం 4,705 మెగావాట్ల విద్యుత్అవసరం, రూ.13,973.86 కోట్ల ఖర్చు అంచనా వేశారు. ఇక ఆయకట్టును పెంచిన మేరకు కాల్వలు పెరిగి.. వ్యయం అదనంగా రూ.736 కోట్లు పెరిగింది. ఇక ప్రాజెక్టులోని 5 పంపింగ్ స్టేషన్లకు అవసరమయ్యే విద్యుత్ వ్యవస్థ (సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల) నిర్మాణం కోసం మొదట రూ.1,674.64 కోట్లు వ్యయం లెక్కగట్టారు. కానీ ట్రాన్స్‌కో సూచనల మేరకు చేసిన మార్పులతో వ్యయం ఏకంగా రూ.3,300.51 కోట్లకు పెరిగిపోవడం విశేషం. ఇక ఉద్ధండాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు, లిఫ్టుల పరిధిలో టన్నెళ్ల పొడవు పెంపుతో వ్యయం పెరిగింది.