EX-soldier
-
మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్ ప్లాన్‌తోపాటు అప్పగించాలని గత జూన్ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్‌కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్‌కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
మాజీ సైనికుడి దారుణ హత్య
సదాశివపేట, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహ్మద్ రఫీక్ బాబా (65) సదాశివపేట మండలం కోనాపూర్ సమీపంలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ దామోదర్‌రెడ్డి కథనం మేరకు.. హఫీజ్‌పేటకు చెందిన సోఫీ, మాజీ సైనికుడు రఫీక్ కలిసి కోనాపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిని ఇటీవలె కొనుగోలు చేశారు. అయితే సదరు భూమిని తనకు చూపాలని సోఫీ కుమారుడు హఫాన్ మూడు రోజుల క్రితం రఫీక్‌ను కోరాడు. ఇందుకు రఫీక్ శుక్రవారం ఉదయం వెళదామని తెలిపాడు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం రఫీక్ ఇంటి నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కారులో డ్రైవర్ గఫార్‌తో కలిసి సదాశివపేటకు బయలు దేరారు. హఫీజ్‌పేట వద్ద హఫాన్ను కారులో ఎక్కించుకున్నాడు. కోనాపూర్‌లోని బసవలింగ ఆశ్రమం వద్ద కారు ఆపారు. అనంతరం ఇటీవల కొనుగోలు చేసిన భూమిని హఫాన్కు చూపేందుకు రఫీక్ ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లాక హఫాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రఫీక్ మెడపై బలంగా పొడిచి పరారయ్యాడు. దీనిని గమనించిన సమీప పంట పొలాలకు చెందిన రైతులు పలువురు విషయాన్ని కారు డ్రైవర్ గఫార్‌కు తెలిపారు. దీంతో గఫార్.. రఫీక్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే రఫీక్ మృతి చెందడంతో సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా మృతుడి కుమారుడు హతిక్ వివరించారు. తమకూ సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించినట్లు సీఐ తెలిపారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌కు సమాచారాన్ని చేరవే సినట్లు ఆయన వివరించారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు హతిక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు హఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. -
స్విమ్మింగ్‌లో బంగారు పతకం
కర్నూలు(స్పోర్ట్స్), న్యూస్‌లైన్: జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు చెందిన మాజీ సైనికుడు జె.లక్ష్మీనారాయణరెడ్డి అద్భుతమైన ప్రతిభను కనపరచి బంగారు పతకం సాధించాడు. 60 నుంచి 64 ఏళ్లలోపు విభాగం 400 మీటర్ల ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్ పోటీల్లో ఈయన విజేతగా నిలిచాడు. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ దూరాన్ని ఏడు నిముషాల 54 సెకండ్స్లో పూర్తి చేసి రికార్డ్ సాధించాడు. గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో అక్టోబర్ 25 నుంచి 27 వరకు ఈ పోటీలు జరిగాయి. జిల్లా స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా క్రీడాసంఘాల ప్రతినిధులు జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించిన జె.లక్ష్మీనారాయణరెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా, ఈయన 2012లో మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్‌లో జరిగిన 9వ జాతీయస్థాయి మాస్టర్స్ ఫ్రీస్టయిల్ 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే 2011 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో 200, 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ అంశంలో రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు.