పెళ్లికి వెళ్లాలి.. కొత్త నోట్లు ఇవ్వండి!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవడానికి ప్రజలు పెద్దసంఖ్యలో బ్యాంకులు ముందు బారులు తీరుతున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోనూ చాలా బ్యాంకుల ముందు వేలమంది బారులు తీరి.. పెద్దనోట్లను మార్చుకోవడానికి పలు అవస్థలు పడ్డారు. చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎదుట వేలమంది నోట్లు మార్చుకోవడానికి క్యూ కట్టారు. ఇక్కడ పెద్దసంఖ్యలో జనం బారులు తీరడంతో నోట్లు మార్చుకోవడానికి వారికి చాలా సమయం పడుతోంది.
కాగా, ఓ వ్యక్తి పెళ్లికార్డు తీసుకొని బ్యాంకు వద్దకు వచ్చాడు. తన స్నేహితుడి కూతురు పెళ్లి రేపు ఉందని, ఈ రోజు సాయంత్రం పెళ్లి రిసెప్షన్ జరుగుతుందని, కాబట్టి తనకు అర్జెంటుగా రూ. 4వేల అధికంగా డబ్బు అవసరముందని అతను శుభలేఖను చూపించి మరీ బ్యాంకు అధికారులను వేడుకున్నాడు. అతను ఎంత బతిమాలుకున్నా బ్యాంకు అధికారులు రూ. నాలుగువేల కన్నా అధికంగా పెద్దనోట్లు మార్చుకోవడానికి అనుమతించలేదు. దీంతో నిరాశ చెందిన అతను మీడియాకు తనగోడు వెళ్లబోసుకున్నాడు.