faculty issues
-
ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. ‘వీసీ’ రాలే!
భైంసా(ముధోల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ని యూనివర్సిటీలకు వీసీ (వైస్ చాన్స్‌లర్)లను నియమించింది. బాసర ట్రిపుల్ ఐటీకి వీసీ నియామకం విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసర– ఆర్జీయూకేటీ)కి మాత్రం ఇన్చార్జి వీసీ పాలనే కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఏళ్లుగా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ఇడుపులపాయ, నూజీవీడు, బాసరలో ఆర్జేయూకేటీ పేరుతో ట్రిపుల్ ఐటీలను అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక చదువుల తల్లి కొలువైన బాసరలోని ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ హోదా కల్పించింది. పాలనపరంగా అడ్డంకులు ఉండకూడదని స్వయం ప్రతిపత్తి కల్పించారు. ట్రిపుల్ ఐటీ ప్రారంభంలో ఓయూ వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన కొనసాగిన అనంతరం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జ కొనసాగుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. బాసర ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది రెగ్యులర్ వీసీ నియామకం కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్ల కోర్సులో భాగంగా ఇక్కడ ఏటా ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 300 మంది వరకు టీచింగ్ స్టాఫ్, వెయ్యి మంది వరకు బోధనేతర సిబ్బంది ఉంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందిస్తూ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న ఈ వర్సిటీలో ప్రవేశాలకు ఏటా పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించిన వారంతా ఇన్‌చార్జీలే కావడంతో పూర్తిస్థాయిలో సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. తమ పరిమితులకు లోబడే పని చేస్తున్నారు. ఇది ట్రిపుల్ఐటీ ప్రగతికి అవరోధంగా మారింది. విద్యాలయ ప్రగతికి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అలాగే యూనివర్సిటీ నిర్వహణను పర్యవేక్షించే గవర్నింగ్ కౌన్సిలింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల పరిధిలోనే ఇన్చార్జీ వీసీలు నిర్ణయాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. విద్యాలయంలో చాలా వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జి వీసీలంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో ఇక్కడికి ‘విజిటింగ్’కే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర రాజధానిలో కీలకవిధి నిర్వహణలో ఉండేవారికే ఇక్కడ ఇన్చార్జి వీసీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో వారు సైతం పూర్తిస్థాయి సమయం కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వీసీ ప్రత్యక్ష పర్యవేక్షణ కరువై పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వీసీ నియామకంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలెన్నో.. ► ఇక్కడ చదివే విద్యార్థులు భోజనం, వసతి, విద్యాబోధన తదితర అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ► కొంతమంది అధికారులు విద్యాలయంలో ఆధిపత్యం చెలయిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ గతంలో పలుమార్లు విద్యార్థులు సైతం ఆందోళన బాటపట్టారు. ► టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌లో ఖాళీలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చదవండి: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో.. -
మీ డాక్టరేట్లను రుజువు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: మీ డాక్టరేట్లు (పీహెచ్‌డీలు) ప్రామాణికమైనవైతే తగు రుజువులు చూపి వాటిని నిరూపించుకోవాలని జేఎన్టీయూహెచ్ తన అనుబంధ కళాశాలల ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీచేసింది.వర్సిటీ అనుబంధ కళాశాలల్లో తప్పుడు పీహెచ్‌డీలతో లేదా సంబంధిత పట్టాపత్రాలు లేకున్నా కొందరు హెచ్వోడీలుగా, అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారికి చెక్ పెట్టడంతో పాటు, ఉన్నవారి పనితీరు సమీక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. నిజమని తేల్చిన తరువాతే.. దీనిలో భాగంగా జేఎన్టీయూహెచ్ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను అందించడం తోపాటు, వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న పీహెచ్డీ పట్టా కలిగిన అధ్యాపక సభ్యులు తమ డిగ్రీలు నిజమైనవని నిరూపించుకోవాలి, అలాగే తమ పనితీరు మూల్యాంకనం కోసం సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ముందు హాజరుకావాలి. కమిటీ సభ్యులు అధ్యాపకుల పీహెచ్డీ డిగ్రీ నిజమైనదా కాదా తేల్చాల్సి ఉంది. అలా ధ్రువీకరణ పొందాకనే వాటిని ఫ్యాకల్టీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతిస్తారు. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. పీహెచ్డీ, ఫ్యాకల్టీల పత్రాలను వర్సిటీకి పంపించే బాధ్యతను అను బంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కమిటీ అప్పగించింది. వీటిని అక్టోబర్ 19లోగా పంపాలి. దీనికోసం పీహెచ్‌డీలు గల అధ్యాపకులు తమ పీహెచ్డీ పత్రాల హార్డ్ కాపీలతోపాటు వర్సిటీల నుంచి పొందిన సర్టి ఫికెట్లను సమర్పించాలి. పరిశీలించిన తర్వాత వీటిని వర్సిటీకి ప్రిన్సిపాళ్లు పంపించాలని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్య తెలిపారు. నకిలీ అధ్యాపకులకు చెక్:పీహెచ్డీ ఉన్న అధ్యాపకులు హార్డ్ కాపీలను గడువులోగా వర్సిటీకి సమర్పించడంలో విఫలమైతే, వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ కళాశాల ల్లో నకిలీ అధ్యాపకులను తొలగించటానికి ఇది తోడ్పడనుంది. యూజీసీ నిబంధనల ప్రకారం 10% మంది అధ్యాపకులకు పీహెచ్డీ హోదా ఉంటేనే ఆ కళాశాలకు అక్రిడేషన్ వస్తుంది. దీంతో కళాశాలలు పీహెచ్డీ ఉన్న వారినే నియమించుకోవటానికి అవకాశం ఉంటుంది. -
టీచర్ల సమస్యలపై ముందుండి పోరాడుతా
ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యారంగంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా కృషిచేస్తాన ని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ న్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్ద కాలంగా ఉపాధ్యాయుల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. ఏళ్ళ తరబడి ఏకీకృత సర్వీస్ రూల్స్ కార్యరూపం దాల్చకపోవడంతో పదోన్నతులు లేక క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ గాడి తప్పిందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోతే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా లభిస్తుందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పావులు కదుపుతోందని ఆరోపించారు. ప్రతి మండలానికో గురుకులాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడికి పోవాలన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రంగా చెపు్పకుంటున్న తెలంగాణలో కరువు భత్యం, 9నెలల పీఆర్సీ బకాయిలు నేటికీ చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ గడిచిన ఆరేళ్లలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ అధికార పార్టీ అండదో బరిలోకి దిగడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. విద్యా రంగం, ఉపాధ్యాయ లోకం ఎదుర్కొంటున్న 20 అంశాలతో కూడిన మ్యానిఫేస్టోను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తనను ఎన్నుకుంటే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని చెప్పారు.