ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ సేవల నిలిపివేత
కైరో: భారత్‌లో ఫేస్బుక్ ఫ్రీబేసిక్స్ అమలుచేసే అంశంపై చెలరేగుతున్న దుమారం నిత్యం వార్తా పత్రికల్లో గమనిస్తున్నదే. అయితే ఇప్పటికే ఫ్రీ బేసిక్స్ సర్వీస్ రుచి చూసిన ఈజిప్టులో మాత్రం దీనిని నిలిపేయాలని అధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈజిప్టులో ఫేస్బుక్ పార్ట్నర్ టెలికామ్ సంస్థ 'ఎతిసలాద్ ఈజిప్ట్'ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఈజిప్టులో ఫ్రీ బేసిక్స్ సర్వీస్ కావాలని 30 లక్షల మంది కోరగా ప్రస్తుతం 10 లక్షల మందికి ఈ సేవలు అందుతున్నాయి. రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ సేవలను ఇప్పుడు నిషేధించడం చర్చనీయాంశం అయింది. ఈ సర్వీస్‌ను ఎందుకు నిలిపేస్తున్నారనే విషయమై అధికారులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎలాగైనా ఈ సేవలను మళ్లీ పునరుద్ధరిస్తామని ఫేస్బుక్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ద్వారా కమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్య, ఉపాధి లాంటి కొన్ని ప్రత్యేక విభాగాల్లో నెట్ సేవలను వినియోగదారులకు ఉచితంగా అందించాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఇండియాలో ఈ సేవలను అందించేందుకు ఫేస్బుక్ సంస్థ రిలయన్స్‌తో చేతులు కలిపింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. ఐఐటీ, ఐఐఎస్సీల ప్రొఫెసర్లు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. దీనివల్ల మన ఫోన్లో ఉండే యాప్‌ల మీద ఫేస్బుక్ నియంత్రణ పెరిగిపోతుందని కూడా అంటున్నారు.