తోటి వేషాలు.. భక్తుల సంబరాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: గంగజాతర సందర్భంగా మూడో రోజైన శుక్రవారం తిరుపతిలో భక్తులు తోటివేషం ధరించి సందడి చేశారు. వీధి వీధినా వేషధారుల కోలాహలం కనిపించింది. నాడు తిరుపతిని పాలించిన దుష్ట పాలెగాడిని హతమార్చి, స్త్రీ జాతికి రక్షణ కల్పించేందుకు గంగమ్మగా ఆదిపరాశక్తి అవతరించింది. ఈ విషయం తెలుసుకుని దాక్కున్న పాలెగాడిని కనిపెట్టేందుకు గంగమ్మ రోజుకొక వేషంలో కనిపించిందనేది జాతరకు సంబంధించి స్థానిక గాథ.
ఇందులో భాగంగా శుక్రవారం గంగమ్మ భక్తులు తోటి వేషాలు వేసుకున్నారు. శరీరమంతా బొగ్గుపొడి పూసుకుని, తెల్లటి బొట్లు పెట్టుకుని తలచుట్టూ, నడుము చుట్టూ వేపాకులు కట్టుకున్నారు. పాత పొరక, చేటను చేతపట్టుకుని ఎదురుపడ్డవారిని తిన్నగా మోదుతూ, బూతులు తిడుతూ నగర వీధుల్లో సందడి చేశారు. తోటి వేషధారులు తొలుత వేశాలమ్మ, పెద్దగంగమ్మను దర్శించుకుని తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు.
ఆలయం ముందున్న అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి పసుపు, కుంకుమ, మిరియాలు వేపాకు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పొంగళ్లు పెట్టి గంగమ్మతల్లికి నైవేద్యాలు సమర్పించారు. కొందరు భక్తులు వేయికళ్ల దుత్తలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు.
దీనికి ముందు ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని కొలువు తీర్చారు. వేలాదిమంది భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. కాగా గంగజాతరలో భాగంగా శనివారం దొరవేషాన్ని వేయనున్నారు. ఈ వేషాన్ని పిల్లలతో పాటు పెద్దలు ఎక్కువమంది వేస్తారు.