ఆరని జ్వాల
సాక్షి, విజయవాడ : మచిలీపట్నంలో పలు పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు దీక్షలు జరిగాయి. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు కోనేరుసెంటర్‌లో చేసిన కర్రసాము ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. దీక్షా శిబిరం వద్ద రక్షాబంధన్ సంబరాలు ఘనంగా జరిగాయి. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులకు విద్యార్థినులు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. గతంలో మాదిరిగానే అన్నాచెల్లెళ్లలా రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా కలిసిమెలిసి ఉండాలంటూ విద్యార్థినులు ఆకాంక్షించారు. జగ్గయ్యపేటలో టూవీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు.
మున్సిపల్ కూడలిలో మానవహారం నిర్వహించగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వత్సవాయిలో జిల్లా సరిహద్దు వద్ద తెలంగాణ వాదులకు రాఖీలు కట్టి సోదరభావంతో కలిసి ఉండాలని కోరారు. గోపినేనిపాలెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కైకలూరు మండలం భుజబలపట్నంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. విజయమ్మ దీక్ష విజయవంతంగా జరగాలని కైకలూరు శ్యామలాంబ దేవాలయంలో మహిళా కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు.
చల్లపల్లిలో వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. విద్యార్థులు చెవులు, నోరు, కళ్లు మూసుకుని నిరసన తెలిపారు. అవనిగడ్డలో నాగాయలంక మండల వైఎస్సార్ సీపీ నాయకులు దీక్ష చేపట్టారు. మైలవరంలోని అన్ని ప్రైవే ట్ పాఠశాలల విద్యార్థులు యూనియన్ బ్యాంకు సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక తెలుగుతల్లి సెంటర్‌కు చేరుకున్నారు. తెలుగుతల్లి సెంటర్లో విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్లులా కలిసుంటాం.. సమైక్యాంధ్ర సాధిస్తామంటూ నినాదాలు చేశారు.
ఇబ్రహీంపట్నం మండల ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, అనంతరం రింగ్ సెంటర్లో మానవహారం నిర్మించారు. నందిగామ పట్టణంలోని ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు, విజయమ్మకు మద్దతుగా మహిళలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ, మున్సిపల్ టీచర్లందరూ సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల సమ్మెతో ఉద్యమం మరింత తీవ్రం కానుంది. విశాలాంధ్ర సమైక్య యాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి హనుమాన్‌జంక్షన్ చేరుకోగా స్థానికంగా స్వాగతం పలికారు.
విజయవాడలో వినూత్న నిరసనలు..
విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మానవహారం ఏర్పాటు చేశారు. ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఉద్యోగులు ఆటా, పాటతో ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ సమన్వయకర్త గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కేసీఆర్ వేషధారణతో ఉన్న వ్యక్తికి మహిళలు సమైక్యాంధ్ర రాఖీలు కట్టారు. గుణదల వాణిజ్య పన్నుల కార్యాలయం వద్ద ఉద్యోగులు గులాబీపూలు పంచి నిరసన తెలిపారు. మా బురదను కాదు కేంద్ర ప్రభుత్వ దుర్బుద్ధిని కడగాలంటూ ప్లకార్డులు చేతబూని పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు మహానాడు సర్కిల్ వద్ద గేదెలను శుభ్రపరుస్తూ నిరసన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకై రిలే నిరాహారదీక్షలో డాక్టర్ సమరంతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. బెంజిసర్కిల్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో రాత్రి కాగడాల ప్రదర్శన జరిపారు.