ప్రేమ, ఆదరణే నిజమైన మూలధనం
- మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ
- పద్మవిభూషణ్ అవార్డు గ్రహితను ఘనంగా సన్మానించిన గవర్నర్
ముంబై సెంట్రల్: ప్రజల ప్రేమ, ఆదరణే జీవితానికి నిజమైన మూలధనమని మాజీ ఉపప్రధాన మంత్రి, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. పద్మవిభూషన్ అవార్డు పొందిన సందర్భంగా ఆయనను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కె.సి. కాలేజీ ఆడిటోరియంలో శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం అద్వానీ మాట్లాడుతూ పార్లమెంట్ హౌస్‌లో కూర్చున్న తనకు అన్ని పార్టీల సభ్యుల నుంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. అద్వానీ తన జీవితంలో అందరి నుంచి మర్యాద, గౌరవం పొందారని గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. తన కర్తవ్య నిర్వహణలో ఎలాంటి లోపం చూపని అద్వానీ, దేశంలో నిజమైన ఐరన్మాన్ అని గవర్నర్ ప్రశంసించారు.
‘హైదరాబాద్ విముక్తి దినోత్సవ’ క్రెడిట్ అద్వానీదే
‘1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ‘హైదరాబాద్ సంస్థానానికి 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్య్రం లభించింది. స్వతంత్రం లభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1998లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సెప్టెంబర్ 17 రోజును ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవాలని అద్వానీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత మరాఠ్వాడా, కర్నాటక్‌లో అదే రోజున ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం మొదలుపెట్టారు’ అని గవర్నర్ విద్యాసాగర్ రావు వెల్లడించారు. కార్యక్రమంలో ఫినోలెక్స్ సంస్థాపకుడు ప్రహ్లాద్ ఛాబరియా, బ్లూ క్రాస్ లేబారేటరీ అధ్యక్షురాలు నిశ్చల్ ఇసరానీ, సామాజిక సేవకురాలు సమున్ తులసీయాని తదితరులు పాల్గొన్నారు.