మూడో రోజూ మునిగింది..!
* బెంగళూరు టెస్టును వీడని వర్షం
* వరుసగా రెండో రోజు ఆట రద్దు
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో ఫలితం తేలే అవకాశాలు తగ్గిపోతున్నాయి. భారీ వర్షం కారణంగా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో సోమవారం కూడా ఒక్క బంతి పడలేదు. ఆటగాళ్లు, అధికారులు కనీసం మైదానంలో అడుగు కూడా పెట్టకుండానే మూడో రోజు ఆట పూర్తిగా రద్దయింది.
రాత్రినుంచి కురుస్తున్న వర్షం సోమవారం ఉదయం వరకు కొనసాగడంతో గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇక ఆట సాధ్యం కాదని ఉదయం 11.30 గంటలకే తేలిపోయింది. వాన కారణంగా ఇప్పటికే మ్యాచ్ రెండో రోజు ఆదివారం కూడా ఆట సాధ్యం కాలేదు. మంగళ, బుధవారాల్లో కూడా ఇదే తరహాలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజులు ముగిసినా రెండు ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు.
ఈ నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రెండో టెస్టు మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే. తొలి రోజు దక్షిణాఫ్రికా 214 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ వికెట్ కోల్పోకుండా 80 పరుగులు చేసింది.