అధ్యక్షా..!
జిల్లా టీడీపీ పీఠం కోసం హోరాహోరీ
టీడీపీ తమ్ముళ్ల వీధిపోరాటాలు
గవిరెడ్డి స్థానంలో లాలం కోసం గంటా వ్యూహం
ఎదురుదాడికి దిగనున్న అయ్యన్న వర్గం
జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు వైఖరిని నిరసిస్తూ కె.కోటపాడులో ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అదే పార్టీ నాయకులు
విశాఖపట్నం: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి!... మంత్రులు గంటా, అయ్యన్నల తాజా వర్గపోరుకు కేంద్ర బిందువు ఇదీ. ప్రతి అవకాశాన్ని తమ ఆధిపత్య పోరుకు వేదికగా మార్చుకునే మంత్రులు గంటా, అయ్యన్న వర్గాల కన్ను తాజాగా జిల్లా పార్టీ అధ్యక్ష పీఠంపై పడింది. అసలు విషయాన్ని బయటపడనీయకుండా ఇరువర్గాలు సై అంటే సై అంటున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో ఇన్చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుకు సమాచారం లేకుండా మంత్రి గంటా పర్యటన... దాంతో ఆగ్రహించిన గవిరెడ్డి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావులపై విరుచుకపడటం.. గవిరెడ్డికి వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మలను అడారి వర్గం దహనం చేయడం... ఇవన్నీ ఆ ఆధిపత్య పోరులోని పరిణామాలే.
గవిరెడ్డికి పొగబెడుతున్న గంటా: జిల్లాలో ఎంపీ అవంతితోపాటు నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తన వర్గంతో ఉన్నప్పటికీ జిల్లా పార్టీపై పట్టు లేకపోవడం మంత్రి గంటాకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడును ఆ పదవి నుంచి సాగనంపాలని ఆయన భావించారు. జెడ్పీ చైర్మన్ లాలం భావాని భర్త భాస్కరరావును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్నది ఉద్దేశం. వాస్తవానికి లాలం భవాని, భాస్కరరావులు మొదటి నుంచి అయ్యన్న వర్గీయులుగానే ఉండేవారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటాకు సన్నిహితంగా ఉండటంతోపాటు భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల దృ ష్ట్యా ఆ భార్యాభర్తలు వ్యూహం మార్చారు. కొంతకాలంగా వారి ద్దరూ మంత్రి గంటాకు సన్నిహితంగా మారారు. ఈ నేపథ్యం లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు రామానాయుడును వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసేందుకు గంటా వర్గం రంగంలోకి దిగింది. అందుకు విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని సాధనంగా చేసుకుంది. మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రామానాయుడుకు కనీస సమాచారం ఇవ్వకుండానే కోటపాడు మండలంలో విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, జెడ్పీ చైర్మన్ లాలం భవాని, లాలం భాస్కరావు హాజరయ్యారు. తద్వా రా రామానాయుడుకు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు.
గంటా, అడారిలపై గవిరెడ్డి ఫైర్: ఈ పరిణామం సహజంగానే మంత్రి అయ్యన్న వర్గానికి ఆగ్రహం తెప్పించింది. గవిరెడ్డి వెంటనే స్పందించి గంటా,ఆడారిలపై విరుచుకుపడ్డారు. ఆ అదను కోసమే ఎదరుచూస్తున్న గంటా వర్గం కూడా ఎదురుదాడికి దిగింది. అడారి తులసీరావు అనుచరులుగవిరెడ్డికి వ్యతిరేకంగా కె.కోటపాడు మండలంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గవిరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో వివాదాన్ని రాజేసి తెగేవరకు లాగేందుకు యత్నించారు.
అధ్యక్షుడికి మార్చాలని ప్రతిపాదన
గంటా వ్యూహం లక్ష్యాన్ని చేరింది. తాజా పరిణామాల ద్వారా గవిరెడ్డి రామానాయుడును తీవ్ర వివాదాస్పద నేతగా మారిపోయారు. దాంతో జిల్లాలో ఓ మంత్రి, ఓ ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలకు ఆమోదయోగ్యంకాని నేతగా బయటపడిపోయారు. ఇలాంటి వివాదాస్పద నేత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సరిపోరని గంటా వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేయనుంది. అందుకు అధినేత చంద్రబాబు సమ్మతించగానే లాలం భాస్కరావును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదనను తెరపైకి తేవాలన్నది గంటా వర్గం వ్యూహం. మరి దీనిపై అయ్యన్న ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.