రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఓట్ల లెక్కింపు సందర్భంగా అమలు
- సీపీ శివధర్‌రెడ్డి వెల్లడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16న ఓట్ల లెక్కింపు సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి. శివధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు నిబంధనలను గమనించి పోలీసువారితో సహకరించాలని కోరారు.
- భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తరం, పెందుర్తి, చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, యలమంచిలి శాసనసభలకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు వారి వారి కౌంటింగ్ గదులకు మద్దిలపాలెం వైపు నుంచి, మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లోకి ప్రవేశించాలి.
- 16 ఉదయం 6గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు సామాన్య ప్రజలను, జనరల్ ట్రాఫిక్‌ను ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డులో అనుమతించరు.
- స్వర్ణభారతి స్టేడియం, బుల్లయ్య కాలేజీ, స్పెన్సర్స్ డిపార్టమెంటల్ స్టోర్సు మధ్య రోడ్డులో సామాన్య ప్రజలు, జనరల్ ట్రాఫిక్‌ను అనుమతించరు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రయాణించాలి. స్వర్ణభారతి స్టేడియం కౌంటింగ్ సెంటర్లకు వచ్చే ఏజంట్లు, అధికారులు వారి వాహనాలను బుల్లయ్య కాలేజీ గ్రౌండ్లో వారికి నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకుని కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లాలి.
- ఉమెన్స్ కాలేజీ కౌంటింగ్ సెంటర్‌కు వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అధికారులు వారి వాహనాలను గొల్లలపాలెం నుంచి అంబేద్కర్ జంక్షన్ వైపు వెళ్లే రోడ్డులో వైఎస్ఆర్ పార్కుకు ఆనుకని ఉన్న సర్వీస్ రోడ్లోను, వైఎస్ఆర్ పార్క్‌లోను వారికి నిర్దేశించిన ప్రదేశంలో పార్కు చేసుకుని కౌంటింగ్ సెంటర్‌కు వెళ్లాలి.
- అంబేద్కర్ జంక్షన్ నుంచి గొల్లలపాలెం మధ్య జనరల్ ట్రాఫిక్‌ను అనుమతించరు.
48 గంటల పాటు 144 సెక్షన్
- ఈ నెల 16న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 48 గంటల పాటు నగరంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ బి.శివధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులు 15వ తేదీ గురువారం సాయంత్రం 6గంటల నుండి 17వ తేదీ శనివారం సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.