టచ్‌స్క్రీన్ గ్లౌజులూ వచ్చేశాయ్..!
టెక్
వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. సాయంత్రం ఆరు గంటలు కాక ముందే చీకటి అలుముకొని చలి దుప్పటి కప్పేస్తోంది కదూ. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా ఉలెన్ వెంట పడాల్సిందే. కప్‌బోర్డుల్లోని స్వెటర్లు, మఫ్లర్లు బయటికి తీయండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ చలి తీవ్రతకు చేతులకు తిమ్మిర్లు పట్టడం లేదా? మరి ముందు వాటికి గ్లౌజులు తీసుకోండి. కానీ కొనే ముందు ఈ విషయాలను తెలుసుకోండి మరి.
గ్లౌజుల జతను తీసుకునే ముందు మీరు వాటిని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తారో ఆలోచించండి. ఆఫీసుల్లో ధరించడానికైతే లెదర్‌ని కొనండి. అవి చలి నుంచి కాపాడటంతో పాటు ఫ్యాషనబుల్‌గానూ ఉంటాయి. అదే మంచు ప్రదేశానికి వెళ్లేట్టు అయితే హార్డ్ గ్లౌజులు తీసుకోవాలి. రాత్రుళ్లు నిద్రపోయే సమయానికి మాత్రం ఉన్ని గ్లౌజులు మేలు చేస్తాయి.
ఇటీవల టచ్‌స్క్రీన్ గ్లౌజులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ గ్లౌజులు టచ్‌స్క్రీన్ ఫోన్లను ఉపయోగించడానికి బాగా సహకరిస్తాయి. వీటి వాడకం వల్ల ఫోన్లపై ఎలాంటి గీతలు, మరకలు పడవు.గ్లౌజులు కొనుగోలు చేసేటప్పుడు సరైన సైజువి తీసుకోవడం ముఖ్యం. మహిళలకు, పురుషులకు వేరువేరు సైజుల్లో ఉన్నాయి. అవి చేతులకు తొడుక్కున్నప్పుడు వేళ్లు ఫ్రీగా కదిలేలా చూసుకోవాలి. గ్లౌజులు మరీ టైట్‌గా మరీ లూజ్‌గా ఉండకుండా చూసుకోండి.
ఇప్పుడు మార్కెట్లో వివిధ రంగుల గ్లౌజులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్, బ్రౌన్, గ్రే కలర్స్ అయితే అన్ని రంగుల డ్రెస్సులకు నప్పుతాయి. అలా కాకుండా తమ స్వెటర్, హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు, బూట్స్లకు మ్యాచింగ్ గానూ కలర్‌ఫుల్ గ్లౌజులు తీసుకోవచ్చు. లేదంటే వెరైటీగా ఉండాలంటే రెడ్, బ్లూ, ఎల్లో, పింక్‌లాంటి గ్లౌజులనూ తీసుకోవచ్చు.