ధనుర్వాతాన్ని తరిమేశాం
‘గ్లోబల్ కాల్ టు యాక్షన్’ సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశం నుంచి ధనుర్వాతాన్ని పూర్తిగా నిర్మూలించామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్న గడువు ఈ ఏడాది 2015 కాగా, అంతకుముందుగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుందని ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య రంగంలో మరిన్ని లక్ష్యాలు సాధిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వెనుకబడిన 184 జిల్లాలను గుర్తించామని, ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
గురువారమిక్కడ జరిగిన ‘గ్లోబల్ కాల్ టు యాక్షన్’ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. 24 దేశాల నుంచి సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రసవ సమయంలో చిన్నారులకు, తల్లులకు వచ్చే ధనుర్వాతాన్ని పూర్తిగా నిర్మూలించాం. ప్రపంచ దేశాలు విధించుకున్న గడువుకు ముందే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాం.’ అని మోదీ చెప్పారు.
ఆరోగ్యం విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో కాస్త వెనుకబడిన 184 జిల్లాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక పథకాలతో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యాక్సిన్‌తో నిరోధించగల వ్యాధితో దేశంలో ఒక్క చిన్నారి కూడా చనిపోకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టంచేశారు.