కార్పొరేషన్లుగా మూడు పట్టణాలు
మారనున్న మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళంల హోదా
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మూడు పురపాలక సంఘాలు కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మున్సిపాల్టీలను సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లుగా మార్చడానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మూడింటి పరిధిలో భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటి సామర్థ్యం పెంచాలని(కెపాసిటీ బిల్డింగ్) నిర్ణయించింది. మచిలీపట్నంలో పోర్టుతోపాటు నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, పోర్టు సిటీని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందుకే మచిలీపట్నాన్ని నగరంగా మార్చనుంది.
పరిశ్రమలకు ప్రోత్సాహం
రెండున్నర లక్షల జనాభా ఉన్న విజయనగరం మున్సిపాల్టీ ఇకపై కార్పొరేషన్‌గా అవతరించనుంది. లక్షన్నర జనాభా ఉన్న శ్రీకాకుళం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చడం ద్వా రా చుట్టుపక్కల ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేస్తోంది. కాగా కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థ(ఉడా)ల ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల కోసం గోదావరి ఉడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.