కాండ్లవాగులో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కొమరోలు, న్యూస్‌లైన్ : మండలంలోని సూరవారిపల్లి గ్రామ సమీపంలో కాండ్లవాగులో 16 మంది విద్యార్థులు కొట్టుకుపోగా వారిలో 13 మందిని స్థానికులు, అధికారులు కాపాడారు. వాగులో గల్లంతైన మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే... మండలంలోని సూరవారిపల్లి, పోసుపల్లి, బోడ్డువానిపల్లి, రామవారిపల్లి గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు కొమరోలులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం వారంతా కళాశాలలకు వెళ్లారు.
అనంతరం తిరిగి గ్రామాలకు చేరుకునేందుకు 16 మంది విద్యార్థులు ఓ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో సూరవారిపల్లి సమీపంలోని పెద్ద బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి కాండ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి అవతలివైపే ఆటోను డ్రైవర్ నిలిపివేశాడు. ఇంకా ఆలస్యమైతే వాగు ఉధృతి మరింత పెరుగుతుందని, ఎలాగోలా వాగుదాటితే త్వరగా ఇళ్లకు చేరుకోవచ్చని విద్యార్థులు భావించారు. ఆ ఉద్దేశంతో 16 మంది విద్యార్థులు వాగుదాటుతుండగా మధ్యలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో అందరూ కొట్టుకుపోయారు.
వారిలో 11 మంది విద్యార్థులు దగ్గరలోనే ఉన్న కంపచెట్లను గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
మిగిలిన ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు వాగులో అరకిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడున్న చెట్ల మధ్యలో చిక్కుకున్నారు. సమాచారం అందుకుని వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఎసై్స రామానాయక్, తహసీల్దార్ పన్నిక మధుసూదనరావులు స్థానికులతో కలిసి తాళ్లసాయంతో వారిద్దరినీ రక్షించారు. ఎసై్స రామానాయక్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వాగులో ఈదుకుంటూ వెళ్లి ఇద్దరు విద్యార్థులనూ తాళ్లసాయంతో ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ముగ్గురు విద్యార్థులు మాత్రం వాగులో గల్లంతయ్యారు.
వారిలో కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మండలంలోని పోసుపల్లి గ్రామానికి చెందిన పన్నింగి పీరాంబీ, గొడుగు పీరాంబీ, గిద్దలూరు శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న బొడ్డువానిపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసులు ఉన్నారు. వారి ఆచూకీ కోసం పోలీస్, రెవెన్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం ఆర్డీఓ రాఘవరావు, డీఎస్పీ జి.రామాంజనేయులు సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.