25 వేల దిగువకు పడిపోయిన బంగారం
బంగారం కొనాలనుకుంటే.. ఇదే మంచి తరుణం. డబ్బులు సిద్ధంగా పెట్టుకోండి. పది గ్రాముల బంగారం ధర 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది. ఫ్యూచర్స్ మార్కెట్లో 524 రూపాయలు పడిపోయి.. ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత దిగువ స్థాయికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన బంగారం కాంట్రాక్టు ధర 2.06 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 24,974 వద్ద ట్రేడయింది. ఈ ధర వద్ద 597 లాట్లు అమ్ముడయ్యాయి.
అక్టోబర్‌లో డెలివరీకి సంబంధించిన బంగారం పది గ్రాముల ధర రూ. 25,200 వద్ద 30 లాట్లు ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండు కారణంగానే ఇక్కడ కూడా ధరలు తగ్గుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు చూసుకుంటే.. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,086.18 డాలర్ల వద్ద ట్రేడయింది. 2010 మార్చి తర్వాత ఇదే అత్యల్ప ధర. చైనాలో కూడా 2009 తర్వాత అత్యల్ప స్థాయిలో బంగారం ట్రేడయింది.