governmnet
-
ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయండి: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహాలను ఖాళీ చేయాల్సిందిగా కళాకారులను కేంద్రం కోరింది. అందులో భాగంగా బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సీ డ్యాన్సర్ గురు మాయాధర్ రౌత్(90)ను అధికారులు వసతి గృహం నుంచి బయటకు పంపించేశారు. దీంతో ఆయన నిరాశ్రయులయ్యారు. వివరాల ప్రకారం.. దశాబ్దాల క్రితం ప్రముఖ కళాకారుల కోసం కేంద్రం ఢిల్లీలో వసతి గృహాలను అందించింది. కాగా, వసతి గృహాల్లో వారు ఉండటాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2014లో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వారు ఇళ్లను ఖాళీ చేయాలని 2020లో నోటీసు జారీ చేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు కూడా ఎనిమిది కళాకారులు బంగ్లాలను ఏప్రిల్ 25వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించుకుంటే చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో వారు ఖాళీ చేయకపోవడంతో గురు మాయాధర్ రౌత్‌ను వసతి గృహం నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా గురు మాయాధర్ రౌత్ కూతురు మధుమితా రౌత్ మాట్లాడుతూ.. ఆ ఇంటిని తన తండ్రికి 25 ఏళ్ల క్రితం కేటాయించారని చెప్పింది. బలవంతంగా తమను బంగ్లా నుంచి బయటకు పంపిచేశారని ఆరోపించింది. పోలీసులు తమ వస్తువులను బయటకు విసిరేశారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘28 మంది కళాకారులలో దాదాపు ఎనిమిది మందికి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తమ ప్రభుత్వ వసతి గృహాల నుండి బయటకు వెళ్లలేదు. దీంతో వారికి నోటీసులు ఇచ్చాము.’’ అని అన్నారు. -
భూముల ధరలు: ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించింది. కరోనా కారణంగా భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ప్రతియేటా ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలు పెంచుతున్న ప్రభుత్వం.. వివిధ వర్గాలు, సాధారణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈసారి ధరల మార్పు చేయడం లేదని పేర్కొంది. -
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మించి రూ. కోట్లు వసూలు చేసిన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లికి చెందిన మండ్ల వసంత, వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన చింతమోని శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్ అశోక్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, కొత్తకోట సీఐ మల్లికార్డున్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. తాను రైల్వేశాఖలో టీసీ (టికెట్ కలెక్టర్)గా ఉద్యోగం చేస్తున్నానని..రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు పడ్డాయని, చాలామంది తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తామనని చెప్పి వసంత చాలామంది యువత నుంచి డబ్బులు వసూలు చేసేది. 2014లో ఆమెకు శాంతయ్య పరిచయం అయ్యాడు. పోలీస్‌శాఖలో తనకు ఉన్నతాధికారులు బాగా తెలుసని ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసింది. నకిలీ అర్డర్ కాపీ అందజేసి.. కొన్నిరోజులు గడిచాక తన ఉద్యోగం ఏమైందని అడుగగా ఎస్ఐ ఉద్యోగం కాదు నీకు సీఐగా పదోన్నతి వచ్చిందని చెప్పి నకిలీ ఆర్డర్ కాపీని అందజేసి పోలీస్ యూనిఫాం కూడా ఇచ్చింది. అప్పటికే అతడు బంధువులు మరికొందరికి ఉద్యోగాలు కావాలని వారి వద్ద డబ్బులు వసూలు చేసి తెచ్చి ఇచ్చాడు. అనంతరం ఆమె చెబుతున్న మాటలు నమ్మక.. తాను మోసపోయానని గుర్తించి ఆమెతో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. వీరు తరచూ వీపనగండ్ల అశోక్‌రెడ్డి కారు తీసుకొని హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లేవారు. రోజూ వీరు మాట్లాడుతున్న మాటలు గమనించి అతను కూడా కలిసిపోయాడు. అందరూ కలిసి పరిసర మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వచ్చారు. రైల్వేలో టికెట్ కలెక్టర్, వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని బత్తుల రాజేశ్ నుంచి రూ.6 లక్షలు, చటమోని అనిల్ దగ్గర రూ.4 లక్షలు, మిద్దె శ్రీనివాసులు నుంచి రూ.2 లక్షలు, కొల్లాపూర్‌కు చెందిన సుధాకర్ దగ్గర రూ.2.50 లక్షలు వసూలు చేశారు. అలాగే గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్దొడ్డికి చెందిన బొమ్మిరెడ్డి విమలకు పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్షలు బ్యారం కుదుర్చుకొని మొదటగా రూ.3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. మిగతా వారుంటే చెప్పండి చూద్దామని నమ్మించటంతో వారి బంధువులతో నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి ఇచ్చింది. పెబ్బేరులో విజయకుమారితో పాటు వారి బంధువుల నుంచి రూ.40 లక్షలు వసూలు చేశారు. పోలీస్ యూనిఫాంతో.. ఉద్యోగం ఏమైంది ఇంకా ఎన్నిరోజులు అన్ని అడిగితే శాంతయ్య పోలీస్ యూనిఫాంతో కారులో వారి ఇంటి వద్దకు వెళ్లి వసంత మేడం ఇప్పించిన ఎస్ఐ ఉద్యోగమే ఇప్పుడు నాకు సీఐగా ప్రమోషన్ వచ్చిందని చెప్పడం ప్రారంభించారు. ఇలా మొత్తం రూ.1.62 కోట్లు వసూలు చేశారు. మరికొందరికి ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్ కాపీలు అందించి రెండునెలల పాటు వారి అకౌంట్లలో నెలకు రూ.14 వేల చొప్పున వేతనాన్ని కూడా వేశారు. వేతనం సరే ఉద్యోగాలు ఏమయ్యాయని అని అడుగగా వారు రోజురోజు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో కొందరు బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసంత, శాంతయ్య, అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్ని వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు 28 మంది బాధితులు ముందుకొచ్చారు. ఇందులో రూ.6 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక ల్యాప్‌టాప్, ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు చేపట్టిన పెబ్బేరు ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి, ఏఎస్ఐ జయన్న, కానిస్టేబుళ్లు స్వామి, భీమయ్యను డీఎస్పీ అభినందించారు. -
‘దవా’ఖానాకు మరో వంద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన వ్యాధులకు అవసరమైన వంద రకాల అత్యవసర మందులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పేదలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఉన్న 238 రకాల అత్యవసర మందులతో కలిపి మొత్తం 338 రకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. నూతన అత్యవసర మందులు వచ్చే ఏప్రిల్ నుంచి ఆసుపత్రులకు చేరతాయి. గుండె, కిడ్నీ, గ్యాస్ట్రిక్, అలర్జీ, థైరాయిడ్, డయాబెటిక్, ఇతర ఇన్ఫెక్షన్లు, జీవనశైలి తదితర జబ్బులకు అవసరమైన అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం వాడే అనేక మందులకు ప్రపంచవ్యాప్తంగా కొత్త రకాల మాలిక్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ మాలిక్యూల్స్‌తో అనేక కంపెనీలు అప్డేటెడ్ ఔషధాలను తయారు చేశాయి. మరోవైపు డెంగీ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్లు, స్వైన్‌ఫ్లూ వంటివి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వాటిని నియంత్రించేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్ సహా పలు మందులనూ ఫార్మా కంపెనీలు తయారు చేశాయి. ఆయా రోగాలకు పాత మందులు పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కొత్త రకాల మాలిక్యూల్స్‌తో తయారైన అప్డేటెడ్ అత్యవసర మందులను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. కమిటీ నివేదిక మేరకు నిర్ణయం.. గతేడాది డెంగీ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్లు రాష్ట్రాన్ని వణికించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 వేల మంది డెంగీ బారిన పడినట్లు అంచనా. అయితే డెంగీ సీరియస్ అయితే దాన్ని లొంగదీసేందుకు అవసరమైన మందులు కానీ, యాంటీ బయోటిక్స్ కానీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో కీలకమైన గుండె, కిడ్నీ, ఇన్ఫెక్షన్లు తదితర వ్యాధుల నివారణకు అవసరమైన అత్యవసర మందులు పూర్తిస్థాయిలో పనిచేసేవి లేవన్న ఆరోపణలున్నాయి. అవే జబ్బులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైన, బ్రాండెడ్ మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చే రోగులు కూడా బయట మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొందరు రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే జబ్బు తగ్గడం లేదని భావించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నయం చేయించుకుంటున్నారు. దీంతో పేద రోగులకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిపై వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఔషధాల కొనుగోలుపై ఏర్పాటైన కమిటీ గత కొన్ని నెలలుగా పరిస్థితిని అధ్యయనం చేసింది. అసలు ఏ మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి.. అవి పనిచేస్తున్నాయా లేదా.. ఇంకా ఫార్మా మార్కెట్లో కొత్త రకాలు ఏమున్నాయన్న దానిపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ మేరకు ఈ 100 రకాల కొత్త మందుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటి కోసం త్వరలో టెండర్లు పిలిచి ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్ణయించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరంలేని మందులు 200 రకాలున్నాయని గుర్తించారు. వాటిని నిలిపేయాలని నిర్ణయించారు. వాటిని వాడుతున్నా రోగం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య రోగాలకు అవసరమైన అన్ని మందులు.. ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రోగాలకు అవసరమైన అత్యవసర మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈసారి మందులు కొనుగోలు చేసేముందు టెండర్లలో పాల్గొనే ఫార్మా కంపెనీల తయారు చేసే ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేస్తాం. నాణ్యత ప్రమాణాలను తెలుసుకుంటాం. నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు అత్యవసర మందులను కొనుగోలు చేస్తాం. ముఖ్యమైన రోగాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులూ ఈ వంద రకాల్లో ఉన్నాయి. పేదల కోసం అత్యవసర మందులను కొనుగోలు చేస్తున్నాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
అవినీతి సర్కారుకు బుద్ధి చెప్పాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అవినీతిమయమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వాలు మనుగడ కోల్పోవడం ఖాయమని అన్నారు. సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీపీఐ ఎమ్మెల్సీ చంద్రశేఖర్, నాయకులు రామకృష్ణ, బాలమల్లేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, కానీ పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు.