చంద్రబాబు దోపిడీని అడ్డుకుంటాం
సాక్షి, రొద్దం: హంద్రీ–నీవా కాలువ పనులు వేగవంతం చేసి అన్ని చెరువులను నీటితో నింపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని ఎన్జీబీ నగర్ సమీపంలో జరుగుతున్న హంద్రీ–నీవా మడకశిర బ్రాంచ్ కెనాల్, పంప్‌హౌస్ పనులను ఆఖిలపక్షం నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, హిందూపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, వైఎస్సార్ సీపీ రాయలసీమ రైతు విభాగం ఇన్చార్జ్ శరత్‌చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజారాం, కదలిక ఎడిటర్ ఇమామ్, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు రమణ తదితరులు మాట్లాడారు.
దోపిడీకి తెరలేపిన సీఎం, మంత్రులు
నయా పైసా ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లవచ్చునని తెలిపారు. అయితే ఈ విషయాన్ని బయటపెట్టకుండా పేరూరు డ్యాంకు నీటిని అందించే మిషతో రూ. 1,020 కోట్ల భారీ దోపిడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తెరలేపారని ఆరోపించారు. ఈ దోపిడీని అడ్డుకుంటామని అన్నారు. జిల్లాకు హంద్రీ–నీవా ద్వారా కృష్ణ జలాలను తీసుకువచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని తెరమరుగు చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు సాగిస్తూ.. కృష్ణాజలాలను తామే ఈ జిల్లాకు తెచ్చినట్లు గొప్పలకు పోతుండడం సిగ్గుచేటన్నారు. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వాస్తవాలను కనుమరుగు చేస్తూ కావాలనే హంద్రీ–నీవా పనుల్లో సీఎంతో మొదలు జిల్లా మంత్రులు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. సాగునీరు లభ్యం కాక ఈ ప్రాంత రైతాంగం కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పెద్దల అవినీతిపై ప్రజలను చైతన్య పరిచి, దోపిడీని అడ్డుకుంటామని అన్నారు.
పనులు పరిశీలించిన అఖిలపక్షం
మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని పరిశీలించేందుకు అఖిలపక్షం శనివారం కెనాల్‌పై పర్యటించింది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే నీరు ఎక్కడికెళ్లే అవకాశముందనే విషయంపై సభ్యులు అధ్యయనం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్ జనరల్ సెక్రెటరీ నాగిరెడ్డి, మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, పెనుకొండ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, వాల్మీకి సేవాదళ్ ఐటీవింగ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, జెడ్పీప్లోర్ లీడర్ బిల్లే ఈశ్వరయ్య, జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, సర్పంచ్ సుధాకర్‌రెడ్డి మండల సీపీఎం కార్యదర్శి ముత్యాలప్ప, డీసీసీ సభ్యుడు నగరూరు నారాయణరెడ్డి, సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.