కొత్త రాష్ట్రంలో కొత్త టిన్ నంబర్లు: హీరాలాల్
హన్మకొండ: జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాపారులకు వేర్వేరుగా టిన్ నంబర్లను కేటాయించనున్నట్టు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వ్యాపార లావాదేవీలల్లో జరిగే మార్పులు, వ్యాపారుల సమస్యలు, ఇతర అంశాలపై ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పరిశ్రమలు, ట్రేడ్ సభ్యులకు వరంగల్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అవగాహన కల్పించింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు 11 డిజిట్లతో కూడిన టిన్ నంబర్లలో మొదటి రెండు నంబర్లను మార్చినట్లు తెలిపారు. తెలంగాణకు 36, ఆంధ్రప్రదేశ్‌కు 37ను కొత్తగా చేర్చామన్నారు. జూన్ 1వరకు పాత టిన్ నంబర్లలో వ్యాపార లావాదేవీలు జరుపుకోవచ్చని, జూన్ 2 నుంచి మాత్రం తప్పకుండా కొత్త నంబర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుకోసం ఏ కార్యాలయానికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
అయితే కొత్త నంబర్లు వచ్చే లోపు ఆడిటింగ్ ఇతర వివరాలు క్లియర్‌గా ఉండాలని వ్యాపారులకు సూచించారు. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలలో వ్యాపారాలను కొనసాగించాలనే వారికి రెండు నంబర్లు, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర, ఆంధ్రలో ఉంటూ తెలంగాణలో వ్యాపారాలను కొనసాగించాలనే వారికి ఒకే టిన్ నంబర్‌తో నిర్వహించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వాణిజ్య శాఖలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో మార్పులు ఉండకపోవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్సల్టెంట్ (రెవెన్యూ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రా, వాణిజ్యపన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ జి.లక్ష్మిప్రసాద్, ట్రేడ్ అండ్ కామర్స్ కమిటీ చైర్మన్ రవీంద్రమోడీ, వైస్‌ప్రెసిడెంట్ అనిల్‌రెడ్డి వెన్నం, వాణిజ్య శాఖ డిప్యూటీ కమిషనర్ కె.హరిత, ఆ శాఖ సిబ్బందితో పాటు, వరంగల్, ఖమ్మం జిల్లాల చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైస్‌మిల్లర్లు, ట్రేడర్లు, డీలర్లు పాల్గొన్నారు.