Hijra marriage
-
ఇష్టపడి హిజ్రాను పెళ్లి.. మరో అమ్మాయిపై మోజు పెంచుకొని
సాక్షి, కుషాయిగూడ: ఇష్టపడి ఓ హిజ్రాను పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేస్తున్న భర్తపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన బండారి నాగేందర్ (32), మల్లాపూర్, నేతాజీనగర్‌కు చెందిన గుత్తికొండ దివ్య (32) అనే హిజ్రాకు స్నేహం కుదిరింది. 2019 వరంగల్ మేడారం జాతరలో దివ్యను చూసిన నాగేందర్ 2019 నవంబరులో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటుగా ఆనందంగా గడిపారు. గత కొన్ని రోజులుగా వైష్ణవి అనే అమ్మాయిపై మోజు పెంచుకొని తనను వేధించడం మొదలుపెట్టాడని దివ్య పోలీసుల ఎదుట వాపోయింది. ఆమెను వివాహం చేసుకొని తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటానని అందుకు అంగీకరించమంటూ మానసికంగా, శారీరకంగా వేధించినట్లు పోలీసులకు తెలిపింది. అంతే కాకుండా నాగేందర్ తల్లి శోభ, అక్క అఖిలవాణి తరచుగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వేంధిపులకు పాల్పడుతున్న నాగేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పోలీసుల సాక్షిగా హిజ్రాకు పెళ్లి
చెన్నై, టీ.నగర్: తూత్తుకుడిలో పోలీసుల సాక్షిగా బుధవారం హిజ్రా పెళ్లి జరిగింది. వివరాలు... తూత్తుకుడి పాలముత్తునగర్కు చెందిన బాలసుబ్రమణ్యం, సుబ్బలక్ష్మి కుమారుడు అరవిందకుమార్. రైల్వే శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన పేచ్చిరామన్, వళ్లి దంపతుల కుమార్తె శ్రీజ. హిజ్రా. ఇలా ఉండగా వీరిరువురు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే ఇందుకు ఇరుకుటుంబాల తల్లిదండ్రులు వ్యతిరేకించి ఆ తరువాత అంగీకారం తెలిపారు. ఇలా ఉండగా ఇరు కుటుంబాలు వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేసి బంధువులకు పంచిపెట్టారు. వీరి వివాహం తూత్తుకుడి శివన్ కోవిల్లో బుధవారం ఉదయం జరిపేందుకు నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసి బంధువులతో పాటు వధూవరులు అక్కడికి చేరుకోగా ఆలయ నిర్వాహకులు ఈ వివాహం జరిపేందుకు నిరాకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. ఆ తరువాత పోలీసుల సమక్షంలో వధూవరులకు వివాహం జరిగింది. -
ప్రియుడి ప్రేమను గెలుచుకున్న హిజ్రా
బెంగళూరు: కర్ణాటకలోని గౌరిబిదనూరు పట్టణంలో ఓ హిజ్రాకు వివాహభాగ్యం కలిగింది. గౌరిబిదనూరు పట్టణం లో నివాసం ఉంటున్న హిజ్రా ఫిజారా (24)ను ముజీబ్ (24) అనే వ్యక్తితో శుక్రవారం వివాహం జరిగింది. పట్టణంలోని 19వ వార్డులో మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మ నేతృత్వంలో ఈ వివాహం జరగింది. గతంలో ముజీబ్‌తో హిజ్రా ఫిజారాకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. దాంతో ముజీబ్ తాను ప్రేమించుకుంటున్నామని తమకు పెళ్లి చేయాలంటూ మహిళా రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యమ్మను ఫిజారా ఆశ్రయించింది. దాంతో ముజీబ్‌ను పిలిపించి భాగ్యమ్మ మాట్లాడారు. తాను ఫిజారాతో వివాహనికి సుముఖంగా ఉన్నట్లు ముజీబ్ వెల్లడించారు. దీంతో భాగ్యమ్మ పెళ్లిపెద్దగా ఆ ఇద్దరికి పెళ్లి జరిపించారు.