ఇలియానాకు లేఖ రాసిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ మహిళకు ఆన్ లైన్ మెయిల్ చేశారు. ఇందులో విశేషం ఏముంది.. అందరూ తరచుగా ఎన్నో మెయిల్స్ చేస్తుంటారని భావిస్తున్నారు కదా.. ఇక్కడో విశేషం ఉంది. 50 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి క్యూబా దేశానికి వచ్చిన తొలి మెయిల్ కావడం గమనార్హం. ఈ రెండు దేశాల మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి సంబంధాలు అంత మంచిగా లేవన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో క్యూబాకు చెందిన ఇలియానా యార్జా అనే మహిళ అమెరికా అధ్యక్షుడికి ఓ లేఖ పంపింది. ఆ లేఖ గమ్యస్థానానికి చేరిందని తెలిసి క్యూబా ఎంతగానో పులకించిపోయింది. అందరికంటే ఇలియానా చాలా సంతోషపడింది. బరాక్ ఒబామాను క్యూబా కాఫీ రుచి చూసేందుకు రావాలని ఫిబ్రవరి 18న తన లేఖ ద్వారా అహ్వానిస్తూ రాసిన లేఖకు ఆయన నుంచి బుధవారం సమాధానం వచ్చింది.
హవానాలోని తన ఇంటికి రావాలని ఒబామాను ఆమె కోరారు. తాను ఈ ఆదివారం క్యూబాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఒబామా తన మెయిల్ లో పేర్కొన్నారు. తనను ఆహ్వానించినందుకు ఆ మహిళకు ధన్యవాదాలు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత మన రెండు దేశాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు జరగడంతో సంబంధాలు మెరుగవుతాయని చెబుతూ ఈ పని చేసినందుకు ఆమెను అభినందించారు. క్యూబా కాఫీ రూచి చూడాలని ఆశపడుతున్నానని వెల్లడించారు. 1928 తర్వాత ఆ ద్వీపానికి వెళ్తున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. ఆరో దశకంలో న్యూయార్క్ నుంచి క్యూబాకు లెటర్ బాంబు వచ్చిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య లెటర్ సేవలు రద్దయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నాళ్లకు అవి మొదలయ్యాయి.