పారిశుధ్య కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ విద్య
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు మెరుగైన విద్యను అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి సోమవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న బాలికలను రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చేర్పించి విద్యనందించాల్సిందిగా కోరారు. జీహెచ్ఎంసీలోని దాదాపు 27 వేలమంది పారిశుధ్యకార్మికుల్లో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందినవారే కావడంతో అందుకు ప్రవీణ్‌కుమార్ సుముఖత వ్యక్తం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇందుకుగాను పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో 6వ తరగతి చదువుతున్న బాలికల వివరాలు సేకరించాల్సిందిగా ఆయన డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా అడిషనల్ కమిషనర్(ఆరోగ్యం–పారిశుధ్యం) రవికిరణŠ కు సూచించారు.