indian flights
-
హైదరాబాద్ విమానం పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగింది?
ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన 12 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ చార్టర్ ఫ్లైట్ పాకిస్థాన్, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఆ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కరాచీలో దిగినట్లు అంతర్జాతీయ మీడియాలు వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 12 మంది ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అయితే, కరాచీలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు గల కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌ను భారత పౌర విమానయాన సంస్థ(సీఏఏ) ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఛార్టర్ ఫ్లైట్ భారత్ నుంచే వెళ్లిందని, ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొంది. గత నెలలో సాంకేతిక సమస్యలతో రెండు విమానాలు కరాచీలో దిగిన తర్వాత ఈ ఛార్టర్ విమానం ల్యాండింగ్ అయింది. అంతకు ముందు స్పైస్‌జెట్ ఢిల్లీ-దుబాయ్ విమానం జులై 5న కరాచీకి మళ్లించారు. అలాగే.. షార్జా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానం జులై 17న కరాచీలో దిగింది. ఇదీ చదవండి: భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’ -
భారత విమానాలపై కెనడా నిషేధం ఎత్తివేత
టొరంటో: నేరుగా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై కెనడా నిషేధం విధించింది. సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి నుంచి భారత్ నుంచి నేరుగా విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రయాణానికి 18 గంటలకు ముందుగా ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని అధీకృత ల్యాబ్ నుంచి చేయించుకున్న కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపింది. ఈ నిర్ణయంపై కెనడాలోని భారత్ హై కమిషనర్ అజయ్ బిసారియా హర్షం వ్యక్తం చేశారు. 27వ తేదీ నుంచి ఢిల్లీ–టొరంటో/వాంకోవర్‌ల మధ్య రోజువారీ సర్వీసులు మొదలవుతాయని వెల్లడించారు. వేరే దేశం మీదుగా కెనడాకు వెళ్లే భారత ప్రయాణికులు కూడా మూడో దేశంలో పొందిన కోవిడ్–19 నెగెటివ్ సర్టిఫికెట్‌ను ముందుగా చూపించాల్సి ఉంటుంది. -
యూఏఈకి వెళ్లే విమానాలకు డెల్టా ప్లస్ బ్రేక్
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లే విమానాలకు కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ బ్రేక్ వేసింది. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తుండటంతో భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. వాస్తవానికి జూలై 7 నుంచి భారత విమాన సర్వీసుల రాకపోకలకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగు చూడడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో పాటు మరో 13 దేశాల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగించింది. జూలై 21 వరకు విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన నేపథ్యంలో ఏప్రిల్ 25 నుంచి మన దేశ విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం విధించింది. ఇటీవల కేసులు తగ్గడంతో భారత విమాన సర్వీసులకు ఆహ్వానం పలికింది. రెండు డోస్‌ల కోవిషీల్డు టీకా తీసుకోవడంతో పాటు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు పొందిన వారికి యూఏఈలో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వనున్నట్లు జనరల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. దీంతో యూఏఈలోని వివిధ కంపెనీల్లో పని చేస్తూ సెలవులపై వచ్చిన వారు, కొత్తగా వీసాలను పొందిన వారు అక్కడకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో డెల్టా ప్లస్ మళ్లీ బ్రేక్ వేసింది. -
భారత్‌పై పాక్ నిషేధం; గందరగోళం
ఇస్లామాబాద్: తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధం విధించిందా, లేదా అనే దానిపై గందరగోళం కొనసాగుతోంది. గగనతల నిషేధంపై పాకిస్తాన్ మంత్రులు ఇద్దరు భిన్న ప్రకటనలు చేయడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా ఇంకా నిషేధం విధించలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి బుధవారం తెలిపారు. ఇటువంటి నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. భారత్ విమానాలు వెళ్లకుండా తమ గగనతలాన్ని మూసివేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫెడరల్ మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని, దీనిపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ గగనతలాన్ని భారత్ ఉపయోగించుకోకుండా సంపూర్ణ నిషేధం విధించాలని తమ దేశం భావిస్తున్నట్టు పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఫవాద్ చౌద్రీ మంగళవారం ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. అఫ్గానిస్తాన్‌కు వెళ్లే భారత వాణిజ్య విమానాలను కూడా రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత్‌కు పాక్ గగనతల దారులను మూసివేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎటువంటి నిషేధం విధించలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటనతో స్పష్టమైంది. బాలాకోట్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరిలో పాకిస్తాన్ గగనతల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నాలుగున్నర నెలల తర్వాత జూలై 16న నియంత్రణలను పూర్తిగా ఎత్తివేయడంతో భారత్, పాకిస్తాన్ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరాచీ గగనతలం మూసివేత కరాచీ మీదుగా వెళ్లే మూడు గగనతల దారులను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) జారీ చేసింది. ఈ నిషేధం అన్ని అంతర్జాతీయ విమాన సంస్థలకు వర్తించనుందని పాక్ విమానయాన అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ నిషేధ సమయంలో విమానాలు కరాచీ మీదుగా కాకుండా, వేరే దారి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. (ఇది చదవండి: పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్ లాస్) -
ఎయిరిండియాకు భారీ ఊరట
పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలకు అనుమతినిస్తూ పాక్ ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతినిస్తున్నామని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎయిర్ మెన్ (నోటామ్) నోటీసు జారీ చేసింది. మంగళవారం రోజు తెల్లవారుజామునుంచి ఏటీఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల విమాన సర్వీసులకు తక్షణమే అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ విమాయాన సంస్థ ఎయిరిండియా భారీ ఊరట కలగనుంది. మరోవైపు గగనతల ఆంక్షలను ఎత్తివేయడానికి పాక్ నోటామ్ జారీచేయడం భారత అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంటనే సవరించిన నోటామ్‌ను జారీ చేసింది. తద్వారా సాధారణ విమాన ట్రాఫిక్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించినట్టు సమాచారం. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దాడుల తరువాత పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో సుమారు 491 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఎయిర్ ఇండియాకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ జూలై 3 న రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం ప్రైవేటు విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ వరుసగా రూ .30.73 కోట్లు, రూ .25.1 కోట్లు, రూ .12.1 కోట్లు నష్టపోయాయి. అటు పాకిస్తాన్ కూడా మూసివేత నిర్ణయానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏదైనా ఒక దేశం గగనతలం మీది నుంచి రాకపోకలు సాగించే విమానాలు వాటి బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశానికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి అయితే 580 డాలర్లు, ఎయిర్‌బస్ 380కి అయితే అంతకంటే పెద్ద మొత్తంలో ఆ దేశ సివిల్ ఏవియేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూసివేత తర్వాత దాదాపు రూ.688 కోట్ల (100 మిలియన్ డాలర్లు) మేర నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. -
అతిచేస్తే ‘నిషేధ జాబితా’లోకి!
న్యూఢిల్లీ: దేశీయ విమానాల్లో దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం వేటు పడనుంది. వీరి పేర్లను ‘నేషనల్ నో ఫ్లై లిస్టు’లో చేర్చాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. సూచనలు, అభిప్రాయాల కోసం ముసాయిదా నిబంధనలను శుక్రవారం విడుదల చేసింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిపై చేయిచేసుకున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సిద్ధమైంది. దురుసు ప్రయాణికులతోపాటు భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులుగా భద్రతా సంస్థలు గుర్తించిన వారినీ జాబితాలో చేరుస్తారు. జాబితాలో అన్ని విమానయాన సంస్థల నుంచి సేకరించిన ఇలాంటి ప్రయాణికుల సమాచారం ఉంటుంది. అయితే నిషేధాన్ని అన్ని విమానయాన సంస్థలు అమలు చేయడం తప్పనిసరేం కాదు. ఇలాంటి లిస్టు ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. ముసాయిదా ప్రకారం.. విమానయాన సంస్థకు చెందిన విచారణ కమిటీ నిర్ణయం తర్వాత పేర్లను ‘నో ఫ్లై లిస్టు’లో చేరుస్తారు. దురుసుతనం స్థాయిని బట్టి 3 రకాలు వర్గీకరిస్తారు. తొలి స్థాయిలో.. మత్తుతో శ్రుతిమించి ప్రవర్తించడం, శరీర కదలికలు, మాటలతో వేధింపులకు పాల్పడితే 3 నెలల నిషేధం ఉంటుంది. రెండోస్థాయిలో.. నెట్టడం, కొట్టడం, ఇతరుల సీట్లను ఆక్రమించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలైన వాటికి ఆరు నెలల నిషేధం విధిస్తారు. మూడో స్థాయిలో.. విమాన నిర్వహణ వ్యవస్థకు నష్టం కలిగించడం వంటి ప్రాణహాని చర్యలకు తెగబడితే రెండేళ్లు లేదా నిరవధిక నిషేధం ఉంటుంది. పదేపదే ఇలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడితే గతంలో విధించిన నిషేధానికి రెండు రెట్ల కాలపరిమితిలో నిషేధం విధిస్తారు. -
విమానం గాల్లో ఉండగానే ట్యాంకు ఖాళీ!
''విమానంలో బాత్రూంకి వెళ్తే ఎలా అన్నయ్యా.. కింద ఉన్నవాళ్ల మీద పడితే ఇబ్బంది కదూ'' ఓ సినిమాలో హాస్య కథానాయకుడు అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ ఇది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా.. జరగదనే ఇన్నాళ్లూ అనుకుంటున్నాం. కానీ.. న్యూఢిల్లీలో సరిగ్గా ల్యాండింగ్ కావడానికి ముందు కొన్ని విమానాలు తమ టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీ చేస్తున్నాయట. దాంతో ఆ వ్యర్థాలన్నీ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఇళ్ల మీద పడుతున్నాయి. ఇలా చేసిన ఒక విమానయాన సంస్థకు రూ. 50 వేల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఇక మీదట ఎవరైనా ఇలా చేస్తే వెంటనే పర్యావరణ పరిహారంగా రూ. 50 వేలు వాళ్లతో కట్టించాలని డీజీసీఏను ఆదేశించింది కూడా. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఇళ్ల మీద మానవ వ్యర్థాలు పడుతున్నాయని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సత్వంత్ సింగ్ దహియా చేసిన ఫిర్యాదును ఎన్జీటీ చైర్పర్సన్ స్వతంత్ర కుమార్ విచారించి దీనిపై పలు సూచనలు ఇచ్చారు. సాధారణంగా అయితే విమానాలు ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్ సిబ్బంది వచ్చి వాటి టాయిలెట్ ట్యాంకులను ఖాళీ చేస్తారు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో గాల్లో ఉండగానే విమానాల్లో లావెటరీ ట్యాంకులు లీకవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్‌పోర్టు సమీపంలో గాల్లో ఉండగా టాయిలెట్ ట్యాంకులను ఖాళీ చేయడానికి వీల్లేదని అన్ని విమానయాన సంస్థలకు చెప్పాలని డీజీసీఏకు గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. స్వచ్ఛభారత్ అభియాన్ అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు ఇలా జరగడం ఏంటని లెఫ్టినెంట్ జనరల్ దహియా తన ఫిర్యాదులో మండిపడ్డారు. కాగా, ఈ విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుసరించిన విధానంపై కూడా ఎన్జీటీ మండిపడింది. పిటిషనర్ ఇంటి మీద పడినవి మానవ వ్యర్థాలేనని స్పష్టంగా తెలుస్తున్నా, దాన్ని చెప్పడానికి ఎందుకంత సంశయిస్తోందని స్వతంత్రకుమార్ ప్రశ్నించారు. ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఒక హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటుచేయాలని, అలాగే ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా సిద్ధం చేసి, రెండింటినీ ప్రజలకు బహిర్గతం చేయాలని డీజీసీఏను ట్రిబ్యునల్ ఆదేశించింది.