విమానం గాల్లో ఉండగానే ట్యాంకు ఖాళీ!
విమానం గాల్లో ఉండగానే ట్యాంకు ఖాళీ!
Published Wed, Dec 21 2016 8:39 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
''విమానంలో బాత్రూంకి వెళ్తే ఎలా అన్నయ్యా.. కింద ఉన్నవాళ్ల మీద పడితే ఇబ్బంది కదూ'' ఓ సినిమాలో హాస్య కథానాయకుడు అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ ఇది. ఎక్కడైనా ఇలా జరుగుతుందా.. జరగదనే ఇన్నాళ్లూ అనుకుంటున్నాం. కానీ.. న్యూఢిల్లీలో సరిగ్గా ల్యాండింగ్ కావడానికి ముందు కొన్ని విమానాలు తమ టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీ చేస్తున్నాయట. దాంతో ఆ వ్యర్థాలన్నీ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఇళ్ల మీద పడుతున్నాయి. ఇలా చేసిన ఒక విమానయాన సంస్థకు రూ. 50 వేల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.. ఇక మీదట ఎవరైనా ఇలా చేస్తే వెంటనే పర్యావరణ పరిహారంగా రూ. 50 వేలు వాళ్లతో కట్టించాలని డీజీసీఏను ఆదేశించింది కూడా.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఇళ్ల మీద మానవ వ్యర్థాలు పడుతున్నాయని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సత్వంత్ సింగ్ దహియా చేసిన ఫిర్యాదును ఎన్‌జీటీ చైర్‌పర్సన్ స్వతంత్ర కుమార్ విచారించి దీనిపై పలు సూచనలు ఇచ్చారు. సాధారణంగా అయితే విమానాలు ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్ సిబ్బంది వచ్చి వాటి టాయిలెట్ ట్యాంకులను ఖాళీ చేస్తారు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొన్ని సందర్భాల్లో గాల్లో ఉండగానే విమానాల్లో లావెటరీ ట్యాంకులు లీకవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్‌పోర్టు సమీపంలో గాల్లో ఉండగా టాయిలెట్ ట్యాంకులను ఖాళీ చేయడానికి వీల్లేదని అన్ని విమానయాన సంస్థలకు చెప్పాలని డీజీసీఏకు గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది.
స్వచ్ఛభారత్ అభియాన్ అంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు ఇలా జరగడం ఏంటని లెఫ్టినెంట్ జనరల్ దహియా తన ఫిర్యాదులో మండిపడ్డారు. కాగా, ఈ విషయంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుసరించిన విధానంపై కూడా ఎన్‌జీటీ మండిపడింది. పిటిషనర్ ఇంటి మీద పడినవి మానవ వ్యర్థాలేనని స్పష్టంగా తెలుస్తున్నా, దాన్ని చెప్పడానికి ఎందుకంత సంశయిస్తోందని స్వతంత్రకుమార్ ప్రశ్నించారు. ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఒక హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటుచేయాలని, అలాగే ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా సిద్ధం చేసి, రెండింటినీ ప్రజలకు బహిర్గతం చేయాలని డీజీసీఏను ట్రిబ్యునల్ ఆదేశించింది.
Advertisement
Advertisement