ఆసియా క్రీడలకు సోమ్‌దేవ్ దూరం
నిర్ణయం సరికాదన్న ‘ఐటా’
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల ప్రారంభానికి ముందే భారత పతకావకాశాలకు దెబ్బపడింది. భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియోన్‌లో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాడు. ఈసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 143వ స్థానంలో ఉన్న సోమ్‌దేవ్.. తన ర్యాంకును మెరుగుపరచుకునేందుకు ఏటీపీ టూర్ టోర్నీల్లో ఆడాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో సోమ్‌దేవ్ భారత్‌కు సింగిల్స్‌లో, డబుల్స్‌లో స్వర్ణ పతకాలు అందించాడు. అయితే సోమ్‌దేవ్ నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తీవ్రంగా తప్పుబట్టింది. ఆసియా క్రీడల్లో ఆడాల్సిందిగా తననెవరూ సంప్రదించలేదన్న సోమ్‌దేవ్ వ్యాఖ్యల్నీ ఖండించింది. ‘దేశం తరపున నంబర్‌వన్ ఆటగాడిగా ఆసియా క్రీడలకు అతడు అందుబాటులో ఉంటాడనే భావించాం.
కనీసం టీమ్ ఈవెంట్లోనైనా ఆడాల్సిందిగా కోరాం. అతనికి విజ్ఞప్తి చేయగలమే తప్ప ఒత్తిడి చేయలేం’ అని ఐటా కార్యదర్శి భరత్ ఓజా అన్నారు. అయినా టెన్నిస్ అనేది వ్యక్తిగత క్రీడ అని, ఏటీపీ టూర్ టోర్నీలు ఆడితేనే వారికి జీవనోపాధి ఉన్నందున చేయగలిగేదేమీ లేదని ఓజా పేర్కొన్నారు. సోమ్దేవ్పై ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేమని, కానీ డేవిస్‌కప్ జట్టు ఎంపిక మాత్రం తమ చేతిలోనే ఉంటుందని అన్నారు. సోమ్‌దేవ్ గైర్హాజరీతో అతని స్థానంలో దివిజ్ శరణ్‌ను ఎంపిక చేసినట్లు ఓజా తెలిపారు.