ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి
పూతలపట్టు : ఆంధ్రా అబ్బాయి, అమెరికా అమ్మాయి శుక్రవారం కాణిపాకంలో ఒకటయ్యారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు. అయినా ఆమెను వివాహమాడి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు అబ్బాయి. పూతలపట్టు మండలం గోపాలకృష్ణాపురం గ్రామానికి చెందిన గోవిందశెట్టి చిన్న కుమారుడు ఇంద్రశేఖర్ సేలంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేశాడు.
బెంగళూరులోని నార్వీ విజన్ కంపెనీలో పనిచేస్తూ ఐదేళ్ల కిందట సౌత్ అమెరికా వెళ్లాడు. అక్కడ అదే కంపెనీలో ఏడాది క్రితం అమెరికాలోని లియానా స్టేట్కు చెందిన లూజ్మిలా థామస్ కూడా చేరింది. పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అమ్మాయి కుటుంబ పరిస్థితులను ఇంద్రశేఖర్కు వివరించింది. ఆమె తల్లిదండ్రులు జార్జ్, జూలియానా చనిపోయినా ఆమె అన్న వీరి పెళ్లికి అంగీకరించారు. శుక్రవారం ఉదయం కాణిపాకం ఆలయం వద్ద ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నారు.