insurance workers welfare
-
ఈపీఎఫ్ సభ్యులకు గుడ్ న్యూస్...!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు ఇక మీదట గరిష్టంగా రూ.7 లక్షల జీవిత బీమా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం గరిష్ట బీమా రూ.6 లక్షలుగా ఉండగా, రూ.7 లక్షలకు పెంచాలన్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ ఆమోదించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను బుధవారం జారీ చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌గంగ్వార్ తెలిపారు. 2020 సెప్టెంబర్ 9నాటి ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో.. మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన బీమా కవరేజీని రూ.7లక్షలకు పెంచాలని నిర్ణయించడం గమనార్హం. ఈపీఎఫ్‌వో సభ్యులకు ‘ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1976’ (ఈడీఎల్ఐ) కింద బీమా కవరేజీ అమలవుతోంది. ఈ పథకం కింద కనీస బీమా రూ.2.5 లక్షలుగా ఉంది. మరణించడానికి ముందు 12 నెలల్లో ఒకటికి మించిన సంస్థల్లో పనిచేసినా బీమా సదుపాయం వర్తింపజేయాలని గతేడాది మార్చిలోనే నిర్ణయించిన విషయం గమనార్హం. గతంలో అయితే చనిపోవడానికి ముందు 12 నెలల్లో సభ్యుడు ఒక్కటికి మించిన సంస్థల్లో పనిచేస్తే బీమా సదుపాయం ఉండేది కాదు. ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో అందుకున్న సగటు వేతనానికి (మూలవేతనం, కరువు భత్యం కలిపి) 30 రెట్ల వరకు బీమా సదుపాయం ఉంటుంది. బీమా కవరేజీకి ఉద్యోగి కనీసం ఇంతకాలం పనిచేయాలన్న నిబంధనేదీ లేదు. -
కార్మిక సంక్షేమానికి భారతీ సిమెంట్స్ పెద్దపీట
గుడివాడ టౌన్: భారతీ సిమెంట్స్ వ్యాపారాభివృద్ధితోపాటు దీనికి అనుబంధమైన తాపీ కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని భారతీ సిమెంట్స్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ వి. పవన్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రైల్వే కళ్యాణ మందిరంలో గుడివాడ తాపీ కార్మికుల వ్యక్తిగత బీమా పాలసీల రెన్యువల్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా తమ వ్యాపారాభివృద్ధిలో తాపీ కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. వారి ప్రోత్సాహానికి తగినట్లుగానే అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల్లో సైతం తాము ముందజలో ఉన్నామన్నారు. వారి సంక్షేమం కోసం కంపెనీ ఉచిత బీమా సౌకర్యం కల్పించిందని వీటిల్ల ప్రతి కార్మికుడు రూ. 2 లక్షలు ప్రమాద రక్షణ బీమా సౌకర్యాన్ని పొందుతాడని వివరించారు. భవిష్యత్‌లో కూడా ఈ పాలసీ విధానాన్ని అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని భారతి సిమెంట్స్ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ జి. ప్రసాద్, భారతీ సిమెంట్స్ డీలర్స్, సతీష్ పెయింట్స్ యజమానులు టి. భాస్కరరావు, టి. సతీష్‌కుమార్ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా ప్రసాద్, కార్యదర్శి పి. జేమ్స్, తాపీ వర్కర్స్ యూనియన్ అథ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మురళి, కోశాధికారి కనకరాజు పలువురు కార్మికులు పాల్గొన్నారు.